దళిత యువకులను దారుణంగా హత్య చేశారు
● జంట హత్యలపై సిట్ బృందంతో
విచారణ చేయించాలి
● మందకృష్ణమాదిగ డిమాండ్
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజక వర్గం పరిధిలో బ్రహ్మంగారి మఠం మండలం పరిధిలో ఈనెల 5వ తేదీన సతీష్, ఓబులేసు అనే యువలకులు దారుణంగా హత్యకు గురయ్యారని తమ విచారణలో నిజనిర్ధారణకు వచ్చామని, ఆ సంఘటనపై సిట్ బృందంతో విచారణ జరపాలనీ ఎమ్మార్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఆయన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ను కలిసి దళిత యువకులైన సతీష్, ఓబులేసుల మరణాలు ప్రమాదవశాత్తు జరిగినవి కావనీ, దారుణంగా హత్యలకు గురయ్యారని తెలియజేశారు. ఈ సంఘటనపై కడపలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. ఈనెల 5, 6వ తేదీల్లో బి. మఠం మండలం లో జరిగిన దళిత మాదిగ యువకుల మరణాలు ప్రమాదవశాత్తు జరగలేదని, ముమ్మాటికీ హత్యలేనని వాటిపై, రాజకీయ ఒత్తిళ్లకు లొంగని అత్యంత నిజాయితీ గల ఐపీఎస్‌అధికారి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశామన్నారు. మోకాలులోతు స్థాయిలో నీళ్లు పారే కాలువలో యువకులు పడి చనిపోయారని పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.పక్కపక్కన నడుచుకొంటూ వెళ్తున్న ఇద్దరూ ఒకే చోట జారి కాలువలో పడిపోతే ఒకరు ఒకచోట, మరొకరు మూడు కిలోమీటర్ల దూరంలో వారి మృతదేహాలు దొరకడం చాలా అనుమానాలకు తావిస్తోందన్నారు. మృతుల్లో ఓబులేసు కు, సతీష్‌కు వేర్వేరు గ్రామాల యువతులతో ఉన్న ప్రేమ వ్యవహారాల విషయం సాక్ష్యాలతో సహా తెలియడంతోనే వారి కుటుంబ సభ్యులు వీరిని హత మార్చి ఉంటారని మేము, కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నామని, ఇలాంటి అనుమానాలు ఇంకా ఎన్నో ఉన్నాయని ఎస్పీకి లోతుగా వివరించారు. ఈ వ్యవహారంపై నిజాయితీ గల ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎస్పీని కోరగా, పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.


