ఖాకీల పచ్చపాతం | - | Sakshi
Sakshi News home page

ఖాకీల పచ్చపాతం

Feb 19 2026 9:32 AM | Updated on Feb 19 2026 4:55 PM

-

పట్టణంలోని యంగ్‌ మెన్స్‌ క్లబ్‌, రోటరీ క్లబ్‌లపై పోలీసుల దాడులు

నిబంధనల మేరకు పేకాట ఆడుతున్న మెంబర్లు

క్లబ్‌లలో పేకాట ఆడితే తమకు ఆదాయం ఉండదని పోలీసులతో దాడులు చేయిస్తున్న టీడీపీ నేతలు

పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఆదాయమే లక్ష్యంగా పచ్చమూకలు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను ‘మేనేజ్‌’చేస్తున్నారు. పోలీసులేమో జీ హుజూర్‌ అంటూ పచ్చ నేతల సేవలో తరిస్తున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయ కుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ప్రతి వ్యవస్థలో తాము చెప్పిందే జరగాలి అన్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు హుకూం జారీ చేస్తున్నారు. ఓ వైపు తాము ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్పుకుంటూనే... మరోవైపు తీవ్ర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో.. అంతకు ముందు దివంగత వైఎస్సార్‌ హయాంలో పులివెందుల ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులు తీసింది. మహానేత వైఎస్సార్‌, జననేత వైఎస్‌జగన్‌ కక్షలు కార్పణ్యాలు పక్కనబెట్టి నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి సారించి వందల కోట్ల నిధులతో పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అలాంటి పులివెందుల ప్రాంతాన్ని ప్రస్తుతం టీడీపీ నాయకులు తమ స్వార్థం, ఆదాయం కోసం భ్రష్టు పట్టిస్తున్నారు. అధికారమే పరమావధిగా కక్ష సాధింపులు, అక్రమ కేసులు బనాయించి పులివెందుల సంప్రదాయాన్ని మంట కలుపుతున్నారు.

కూటమి నేతలకు అండగా పోలీసులు

పులివెందులలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు పోలీసుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. పులివెందుల ప్రాంతంలో పనిచేస్తున్న సబ్‌ డివిజన్‌ అధికారికి రాయలసీమ రేంజ్‌ అధికారి అండదండలు ఉండడంతో తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. రాయలసీమ రేంజ్‌ అధికారి, పులివెందుల సబ్‌ డివిజన్‌ అధికారి గత జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించి పులివెందుల ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఏ విధంగా జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారనే విషయం రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా గమనించారు.

జూదంపై దాడి చేసిన ఎస్‌ఐ ట్రాన్స్‌ఫర్‌

రెండు నెలల క్రితం పులివెందుల పట్టణంలోని టీడీపీ నాయకుడు ఉలిమెల్ల రోడ్డులో తన తోటలో జూదం నిర్వహిస్తుండగా కొత్తగా ఎస్‌ఐ పోస్టింగ్‌ వచ్చిన అధికారి ఆ జూదశాలపై దాడులు చేశారు. ఆ విషయంలో పులివెందుల ద్వితీయ శ్రేణి నాయకులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సాక్షాత్తూ డీఎస్పీ సమక్షంలోనే ఆ ఎస్‌ఐపై తిట్టారు. సదరు అధికారి పూర్తిగా టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఎస్‌ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతే నిష్పక్షపాతంగా విధులు నిర్వహించిన ఆ ఎస్‌ఐని బదిలీని బహుమానంగా అందించారు.

జూదం జోరుగా...

పులివెందుల నియోజకవర్గంలో యథేచ్చగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జూదశాలలు నిర్వహిస్తున్నారు. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్‌ తన తమ్ముడికి చెందిన తోటలో 18 నెలల నుంచి యథేచ్చగా జూదం నిర్వహిస్తున్నారు. అలాగే పులివెందులలోని ద్వితీయ శ్రేణి నాయ కులు చెన్నారెడ్డి కాలనీ, నారాయణ కాలేజీ సమీపంలో, నగరిగుట్ట సమీపంలో, వారికి సంబంధించిన అనేక స్థావరాలలో జూదం నిర్వహిస్తున్నారు. అయినా అటువైపు పులివెందుల పోలీసులు కన్నెత్తి చూడడంలేదు.

పులివెందుల క్లబ్బులపై దాడులు

పులివెందులలో 50ఏళ్ల నుంచి రోటరీ క్లబ్‌, యంగ్‌ మెన్స్‌ క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్లబ్‌లలో నిబంధన మేరకు కేవలం అందులో సభ్యత్వం తీసుకున్న మెంబర్స్‌కు మాత్రమే జూదమాడే అవకాశం ఉంటుంది. అలాగే క్లబ్‌ నిబంధన మేరకు ఇందులో క్యారం బోర్డు, షటిల్‌, టెన్నిస్‌ వంటి ఆటలు కూడా ఆడుతూ ఉంటారు. గత పది రోజుల నుంచి టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు ఈ క్లబ్బుల పై పోలీసులు దాడులు నిర్వహించారు. వారం క్రితం ఒకసారి, బుధవారం మరోసారి దాడులు నిర్వహించారు. టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న జూదాలకు ఆదాయం తక్కువ అవుతుందనే ఉద్దేశంతోనే వారు ఈ విధంగా క్లబ్బులపై దాడులు చేయిస్తున్నారని మెంబర్స్‌ ఆరోపిస్తున్నా రు. సాధారణంగా ఇటువంటి క్లబ్బులలో రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ తదితరులు కాలక్షేపం కోసం నిబంధన మేరకు జూదమాడుతూ ఉంటారు. అలాంటి క్లబ్బులపై దాడులు నిర్వహిస్తే తమ జూదశాలలకు మరింత ఆదాయం ఉంటుందని టీడీపీ నాయకులే పోలీసులను అడ్డుపెట్టుకొని ఇలాంటి దాడులు చేస్తున్నారని వారు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement