మార్చి 11న వైవీయూ స్నాతకోత్సవం
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మార్చి 11వ తేదీన నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ విశ్వవిద్యాలయ కులపతి రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి వర్సిటీకి ఉత్తర్వులు చేరాయి. ఏకకాలంలో ఒకే వేదికపై నిర్వహించే 11వ, 12వ 13వ, 14వ స్నాతకోత్సవం ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. ప్రతిభావంతులు బంగారు పతకాలను అందుకుంటారు. విశ్వవిద్యాలయ రెగ్యులర్ ఉపకులపతిగా ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ బాధ్యతలను స్వీకరించాక గత నెల 2వ తేదీన రాష్ట్ర గవర్నర్‌ను కలిసి కాన్వకేషన్ నిర్వహణ అనుమతి కోరారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతి రావడంతో బుధవారం సాయంత్రం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కె.ఎస్.వి కృష్ణారావు , కాన్వకేషన్ కోర్ కమిటీ ప్రతినిధులు ప్రొద్దుటూరు ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జయ చంద్రారెడ్డి, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఎస్ రఘునాథరెడ్డి,ఎం.జి. దాము, నజీర్ అహ్మద్, విజయలక్ష్మితో తన ఛాంబర్ లో సమావేశం అయ్యారు. కాన్వకేషన్ ప్రాధాన్యత అంశాలపై చర్చించారు.


