వైభవంగా కామాక్షి త్రేతేశ్వరుని కల్యాణం
రాజంపేట రూరల్ : ప్రముఖ శైవ క్షేత్రమైన అత్తిరాలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు నిర్వహించిన శ్రీకామాక్షి సమేత శ్రీత్రేతేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. తొలుత కామాక్షిదేవి, త్రేతేశ్వరస్వామి వారిని పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక ఆసనంపై ఆశీనులను చేశారు.ఆలయ ప్రధాన అర్చకులు కె.వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పండితులు వేద మంత్రాలు పఠిస్తూ కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు.


