వైష్ణవాలయంపై గుప్త నిధుల ముఠా విధ్వంసం
బి.కొత్తకోట : జిల్లాలో అత్యంత ప్రధానమైన ఆలయాలు వేళ్లతో లెక్కపెట్టవచ్చు. అందులో పురాతన, అతి ముఖ్యమైన, కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోని 15వ శతాబ్దం నాటి సొంపాళ్యం చెన్నకేశవాలయం ఒకటి. ములకలచెరువు మండలంలోని ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. విదేశీయుల దాడులకు, కాలానికి ఎదురొడ్డి చరిత్రకు సాక్షిగా నిలిచింది. గర్భగుడిలోని చెన్నకేశవస్వామి విగ్రహం కింద, ఆలయం ఎదుట ఉన్న 50 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం అంతర్భాగంలో వజ్ర, వైడూర్యాలు నిక్షిప్తమై ఉన్నాయన్న ప్రచారం ఉండటంతో దుండగులు ఆలయంపై కన్నేశారు. విదేశీయుల దాడులతోనే కాక ఇక్కడి ముఠాల ఘాతుకాలకు ప్రస్తుతం ఆలయ భద్రత ప్రశ్నార్థకం అవుతుండగా, మరోవైపు గుప్త నిధుల ముఠాల కారణంగా ఆలయం ధ్వంసానికి గురవుతూ వస్తోంది. చోళ–విజయనగర పాలకులు నిర్మించిన చెన్నకేశవ ఆలయంపై గుప్త నిధుల ముఠాలు ఎన్నో ఏళ్లుగా కన్నేశాయి. ఈనెల 12న రాత్రి గుప్త నిధుల ముఠా పథకం ప్రకారం ఆలయంలోకి చొరబడి కళ్యాణమండప పైకప్పులోని మొగ్గను ధ్వంసం చేసింది.
పథకం ప్రకారమే
ఈనెల 12న రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు, గర్భగుడికి కుడివైపు ఉన్న దేవతా మూర్తుల కల్యాణ మండపం వద్దకు వచ్చి గుప్తనిధులు, అందులో వజ్ర వైడుర్యాలు ఉంటారని భావించి మంటపం పైన మధ్యలోని మొగ్గను ధ్వంసం చేశారు. వాటి ఆ మొగ్గ మొక్క పగిలి రాయి ముక్కలు అక్కడే పడి ఉన్నాయి. దుండగులు ముందుగా ఆలయానికి విద్యుత్ సరఫరా వచ్చే వైర్లను కత్తరించి లోపలికి వెళ్లినట్టు చెబుతున్నారు. రాత్రివేళ భద్రత లేకపోవడంతో వీరు లోపలికి వెళ్లేందుకు అడ్డులేకపోయిందని సమాచారం. అయితే ఈ ముఠా ఎవరు, ఎక్కడివారు, ఎంతమంది అనే వివరాలు ఇంకా వెలుగులొకి రాలేదు. వీరు స్థానికులా స్థానికేతరులా, గుప్త నిధులకు అలవాటుపడిన ముఠానా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. ధ్వంసమైన మొగ్గను పోలీసులు పరిశీలించారుకాని తదుపరి చర్యలు ఏమిటో తెలియలేదు.
విశేషమై మంటపం
ఆలయానికి నైరుతి దిశలో నిర్మించిన అద్భుతమైన రాతి కల్యాణమంటపం నాలుగు చదరపు స్తంభాలతో వివిధ కళాకృతులతో వేదికను అలంకరించారు. గ్రానైట్‌రాయి, మంటపంపైన బండరాయితో నిర్మించగా మొత్తం నిర్మాణం రాళ్లపైనే చెక్కబడింది. సూక్ష్మ బొమ్మలు, జంతువులు తదితరవాటిని చెక్కబడ్డాయి. ప్రతిరాతిపైనా విశేషమైన శిల్పకళ కనిపిస్తుంది. ఇంతటి విశేషమైన శిల్ప హంపిలో కనిపిస్తుందని చెబుతారు.
2009లోనూ..
2009 ఆగస్టు 30న ఓ గుప్త నిధుల ముఠా సామగ్రితో ఆలయంలోని గర్భగుడిలో తవ్వకాలు జరిపేందుకు ముసుగులు వేసుకుని చొరబడింది. ఈ ముసుగు దొంగలు ఎవరన్నది ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. వెంట తెచ్చుకున్న నిచ్చెన ద్వారా లోనికి ప్రవేశించగా అప్పుడు భద్రతగా ఉన్న హోం గార్డులు అడ్డుకున్నారు. దీంతో దుండగులు వెంట తెచ్చుకున్న మారణాయుధాల్లో కొన్నింటిని వదిలేసి వెళ్లగా అప్పటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మారణాయుధాల్లో సుత్తులు, రాడ్లు, కారంపొడి, స్టాండులు లభ్యమయ్యాయి. వీటిని శిల్పాలు తొలగించేందుకే తెచ్చి ఉంటారని పోలీసులు అప్పట్లోనే నిర్ధారించారు.
ఈ కేసును అప్పట్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకపోవడంతో ఈ ముసుగు దొంగలు తప్పించుకున్నారు. ఆ తర్వాత 2014లోనూ ఇదే తరహాలో గుప్త నిధుల ముఠా ప్రయత్నాలు సాగాయి.
ఆలయ భద్రత ప్రశ్నార్థకం
సొంపాళ్యం చెన్నకేశవాలయం కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించిన అధికారులు తిరుపతిలో ఉంటారు. ఆలయానికున్న చారిత్రిక నేపథ్యం, సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకోవడమేకాక, ఇలాంటి ఆలయ నిర్మాణం మరోటిలేదు. ఈ ఆలయాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికే పలుమార్లు గుప్త నిధుల ముఠాల కారణంగా ధ్వంసం అవుతూ వస్తున్న ఆలయ భద్రతపై ఇప్పటికేనా స్పష్టమైన చర్యలు చేపట్టకపోతే ఆలయ ఇలాంటి మూఠాల చేతితో విధ్వంసాలకు గురయ్యే ఆస్కారం లేకపోలేదు. దాంతోపాటు ఈ గుప్త నిధుల ముఠా ఏదో గుర్తించి వారి ఆటలను కట్టించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.
సొంపాళ్యం ఆలయంలో వెలకట్టలేని
శిల్ప సంపద నాశనం
వైష్ణవాలయంపై గుప్త నిధుల ముఠా విధ్వంసం


