మాదకద్రవ్యాల నిర్మూలనకు కార్యాచరణ
మదనపల్లె: జిల్లాలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కార్యాచరణ, కళాశాలలు, విద్యాసంస్థలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భద్రతపై డ్రోన్ పెట్రోలింగ్ చర్యలను విస్తృతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పోలీసు శాఖను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం శాంతి భద్రతలు, మహిళల సంరక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి జిల్లాకు చెందిన డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా మహిళలపై నేరాలకు సంబంధించి ప్రజల నుండి తీసుకున్న అభిప్రాయాలను పరిశీలించారు. నమోదైన కేసులు, అవగాహన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం అమలు చేయాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల వైపు వెళ్లకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను మండల, గ్రామ, కళాశాల, పాఠశాలలలో స్థాయిలో నిర్వహించాలన్నారు. డీ–అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. కాగా త్వరలో ఈగల్ క్లబ్ సభ్యుల మెగా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.
కలెక్టర్ నిశాంత్ కుమార్


