సమగ్ర శిక్ష ఏపీసీ అనూరాధ
మదనపల్లె సిటీ: వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలో రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర–2 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సరఫరా చేయనున్న షూలకు సంబంధించి, విద్యార్థుల పాదాల కొలతలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ నున్నె అనూరాధ తెలిపారు. శనివారం మదనపల్లె మండలం కొత్తవారిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల పాదాల కొలతలను పరిశీలించారు. రిజిస్టర్‌లో నమోదు చేసిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. విద్యార్థులను కూర్చోబెట్టి కొలతలు తీయడం, అంచనాల ప్రకారం లేదా రౌండ్ ఫిగర్‌గా నమోదు చేయడం వంటి చేయరాదన్నారు. ఏదైనా పాఠశాలల్లో పాదాల కొలత తప్పుగా నమోదు చేసి ఉన్నట్లయితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సవరణ చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఫిబ్రవరి 2వతేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎడిట్ ఆప్షన్ ద్వారా తప్పులు సరిచేయాలని ఆదేశించారు. సమ గ్రశిక్ష కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి కరుణాకర్,ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, హెచ్‌ఎం మోహన్, పీడీ భద్రయ్య పాల్గొన్నారు.


