వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
రొంపిచెర్ల : గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చైన్నై– అనంతపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్‌రోడ్డులో సోమవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ మధుసూధన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి 11 గంటల సమయంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారులు చూసి రొంపిచెర్ల పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని 108లో అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుంది. మృతుడి ఆచూకీ తెలియని వారు కల్లూరు సీఐ జయరాం నాయక్ 9490617885, రొంపిచెర్ల ఎస్‌ఐ 9440900709 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు.


