యూరియా కోసం రైతుల ఘర్షణ
● ఐదు గంటల్లో అయిపోయిన ఎరువు
● వారం రోజుల్లో ఇస్తాం : రాజేశ్వరి
రొంపిచెర్ల : యూరియా కోసం రైతులు ఘర్షణ పడ్డ సంఘటన రొంపిచెర్ల మండలం గానుగచింత రైతు సేవా కేంద్రంలో మంగళవారం జరిగింది. రైతుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గానుగచింత రైతు సేవా కేంద్రానికి మోటుమల్లెల, గానుగచింత గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 2250 మంది రైతులకు 400 బస్తాల యూరియా సోమవారం వచ్చింది. దీంతో రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జి రాజేశ్వరి మంగళవారం ఉదయం 10 గంటలకు యూరియా పంపిణీ ప్రారంభించారు. అయితే యూరియా కొరత ఎక్కువగా ఉండటంతో రైతులు భారీగా చేరుకున్నారు. రైతుల పేర్లను వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వరి ఆన్‌లైన్ చేసి ఇస్తుండగా.. మరి కొందరు రైతుల పేర్లు ఆన్‌లైన్ చేయకుండానే పంచాయతీ అధికారుల సాయంతో యూరియా తీసుకుని వెళ్లారు. ఎక్కువగా ఒక గ్రామానికి చెందిన రైతులే తీసుకెళ్లారని మరి కొందరు అభ్యంతరం చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకే 400 బస్తాల యూరియా పంపిణీ అయిపోయింది. దీంతో తుర్పుగడ్డ, పడమర గడ్డ రైతులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రైతు సేవాకేంద్రం ఇన్‌చార్జి రాజేశ్వరి ఇరు వర్గాలకు సద్ది చెప్పి.. మరో వారం రోజులలో 300 బస్తాల యూరియా తెప్పించి రైతులకు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు వెనుతిరిగి వెళ్లారు.
మోటుమల్లెల రైతు సేవా కేంద్రంలోనే ఇవ్వాలి
మోటుమల్లెల గ్రామ పంచాయతీకి చెందిన రైతులకు మోటుమల్లెల రైతు సేవా కేంద్రంలోనే యురియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గానుగచింత, మోటుమల్లెలలో రెండు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసే వారని.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మోటుమల్లెల రైతు భరోసా కేంద్రాన్ని రద్దు చేసి రెండు గ్రామ పంచాయతీలకు గానుగచింత రైతు సేవా కేంద్రంలోనే ఎరువులు ఇస్తున్నారు. అయితే మోటుమల్లెల గ్రామ పంచాయతీ రైతులకు తెలియకుండానే ఎరువుల పంపిణీ జరిగి పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విడత మోటుమల్లెల రైతులకు అక్కడే యూరియా పంపిణీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
గానుగచింత రైతు సేవా కేంద్రంలో ఘర్షణ పడుతున్న రైతులు
యూరియా కోసం రైతుల ఘర్షణ


