ప్లెక్సీ చించిన వారిపై చర్యలు తీసుకోండి
ఓబులవారిపల్లె : రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అభిమానంతో ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మారే సుకుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముక్కావారిపల్లి పంచాయతీ, అమృతవారిపల్లి జాతీయ రహదారి సమీపంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులంతా కలిసి ఆయనపై అభిమానంతో పెద్దఎత్తున డబ్బులు పోగుచేసుకొని ప్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారని, అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చించేశారని ఆరోపించారు. మరలా నూతన సంవత్సరం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అభిమానంతో కొత్త ప్లెక్సీని ఏర్పాటు చేశామని, దాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు చించిపారేశారని ఫిర్యాదు చేశారు. సిసి కెమెరాలను పరిశీలించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.


