కుప్ప‘కూలి’న బతుకు
మదనపల్లె రూరల్ : పొట్ట కూటికోసం కూలికి వెళ్లి పనులు చేస్తూ కుప్పకూలి భవననిర్మాణ కార్మికురాలు మృతి చెందిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నక్కలదిన్నెకు చెందిన నాగలక్ష్మి(35) భర్త రవికుమార్ ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. నాలుగేళ్ల కుమార్తె లహరితో కలసి ఉంటోంది. జీవనోపాధి నిమిత్తం స్థానికంగా భవన నిర్మాణ పనులకు వెళుతుండేది. ఆదివారం పట్టణంలోని దేవళంవీధి శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయ సమీపంలో పనులకు వెళ్లింది. అక్కడ ఇసుకను బేసిన్‌లో నింపుకుని పై అంతస్థులో వేసి తిరిగి కిందకు వచ్చేది. ఇలా రెండు, మూడుసార్లు చేసిన అనంతరం మరోసారి పైకి వెళ్లి ఎంతసేపటికీ కిందకు రాకపోవడంతో తోటి కూలీలు పైకి వెళ్లి గమనించారు. నాగలక్ష్మి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి, హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన ఆస్పత్రి అత్యవసర విభాగ వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెంది ఉంటుందని చెప్పారు. తల్లి, తండ్రి మరణించడంతో కుమార్తె లహరి ఒంటరి అయింది. నాగలక్ష్మి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం బంధువులు తీసుకెళ్లారు.
కూలి పని చేస్తూ గుండెపోటుతో
భవన నిర్మాణ కార్మికురాలి మృతి


