తొలి జీతానికి తకరారు | - | Sakshi
Sakshi News home page

తొలి జీతానికి తకరారు

Dec 8 2025 8:04 AM | Updated on Dec 8 2025 8:04 AM

తొలి

తొలి జీతానికి తకరారు

కల సాకారమయ్యేదెన్నడో..

మదనపల్లె సిటీ: వారందరూ అనేక సంవత్సరాలు కష్టపడి డిగ్రీలు, పీజీలు,బీఈడీలు,డీఎడ్‌లు చేసిన ఉన్నత విద్యావంతులు. లక్షలాది మందితో పోటీపడి టెట్‌, డీఎస్సీలో ప్రతిభ కనబరిచిన వారు. మెగా డీఎస్సీ 2025 ద్వారా ఉపాఽ ద్యాయ కొలువు సాధించారు. అయితే ఉద్యోగంలో చేరి రెండు నెలలు పూర్తయి మూడో నెలలోకి ప్రవేశించినా వారికి జీతాలు రాలేదు. దీంతో వారి బాధలు వర్ణణాతీతం. మంచి ర్యాంకులు తెచ్చుకుని ఉద్యోగాలు సాధించిన టీచర్లకు తొలి జీతం అందుకోవడంలో తిప్పలు తప్పడం లేదు. ప్రతి నెలా వేతనం చెల్లించేందుకు ట్రెజరీలో ఉద్యోగి ఐడీతో పాటు పర్మినెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (ప్రాన్‌) జనరేట్‌ చేస్తారు. ఈ సంఖ్య కోసం టీచర్లు ఇప్పటికీ ట్రెజరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలో....

ఉమ్మడి కడప జిల్లాలో 680 మంది, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో 1408 మంది ఉపాధ్యాయులు కొత్తగా కొలువుల్లో చేరారు. అంతకు ముందు వారికి మదనపల్లె సమీపంలోని గ్రీన్‌వ్యాలీ స్కూలు, తిరుపతి, చిత్తూరులలో ఇండక్షన్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. లాంగ్వేజ్‌, సైన్స్‌, సోషల్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఎస్‌జీటీ... ఇలా క్యాడర్ల వారీగా అక్టోబర్‌ 3 నుంచి 10వతేదీ వరకు శిక్షణ పొందారు. అనంతరం 13న విధుల్లో చేరారు. కొంత మంది తర్జనభర్జనల అనంతరం శిక్షణ తీసుకున్న రోజు నుంచి విధుల్లో చేరినట్లుగానే భావించాల్సి ఉంది. తొలుత 3వతేదీనా లేక 13వతేదీనా అనే విషయం తేల్చడానికి సమయం పట్టింది. సర్వీసు రిజిస్టర్‌ (ఎస్‌ఆర్‌)లో జాయినింగ్‌ తేదీ నిర్ధారిస్తూ ప్రభుత్వం జీఓ ఇవ్వడానికి సమయం తీసుకోవడంలో ఏర్పడిన జాప్యం వేతనాల చెల్లింపులో కూడా ఆలస్యమైందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కొత్త ఉపాధ్యాయులు వేతనం పొందాలంటే ఐడీ, ప్రాన్‌ తప్పనిసరి కావడంతో వాటిని క్రియేటివ్‌ చేయాల్సి ఉంది. ట్రెజరీ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే వారికి డీడీఓలు వేతన బిల్లులు తయారు చేసి మళ్లీ ట్రెజరీకి పంపుతారు. అక్టోబర్‌ 3 నుంచి 10వ తేదీ వరకు ఇండక్షన్‌ ట్రైనింగ్‌ పొందిన కొత్త టీచర్లు అదే నెల 13న విధుల్లో చేరారు. వారందరికీ మూడో తేదీ నుంచి వేతనాలివ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. విధుల్లో చేరే సమయానికి ట్రెజరీ ఐడీ, ప్రాన్‌ కేటాయించకపోవడంతో అక్టోబర్‌ నెల జీతం పొందలేకపోయారు. నవంబర్‌ 6 నుంచి 11వతేదీ మధ్యలో సప్లిమెంటరీ బిల్లులు ట్రెజరీలో పొందుపరిచే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికి ట్రెజరీ ఐడీ, ప్రాన్‌ పూర్తి స్థాయిలో కేటాయింపు కాలేదు. అక్టోబర్‌ నెల బకాయి బిల్లు తీసుకుంటేనే కానీ నవంబర్‌ నెల రెగ్యులర్‌ బిల్లు చేయడానికి వీలు కాదు. దీంతో డిసెంబర్‌ 1 తేదీన తొలి వేతనం పొందే అవకాశం కొత్త టీచర్లకు చిక్కలేదు. డిసెంబర్‌ 6 నుంచి 11వతేదీ మధ్యలో అరియర్‌ బిల్లులు సబ్మిట్‌ చేస్తే ఈనెల 15 తర్వాత రెండు నెలల జీతాలు పొందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరి మొదటి జీతం కళ్ల చూద్దామంటే సాంకేతిక ఇబ్బందులు కారణంగా ఆ కల దూరమవుతోందని నూతన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త టీచర్లకు తప్పని ఎదురుచూపులు

మూడో నెల వచ్చినా జీతాలేవీ?

తొలి జీతానికి తకరారు 1
1/1

తొలి జీతానికి తకరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement