పెన్షనర్‌కు లోను పేరుతో బురిడీ
మదనపల్లె రూరల్ : ప్రభుత్వం పెన్షనర్లకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని రూ.5లక్షల రుణం అందిస్తోందని, ఈరోజే చివరిరోజు. రూ.1 లక్ష 35 వేలు డిపాజిట్ చేస్తే సబ్ కలెక్టర్ ఆఫీసులో చెక్కు అందిస్తారని ఓ రిటైర్డ్ ఉద్యోగిని అపరిచితుడు మోసగించి లక్ష రూపాయలతో ఉడాయించిన ఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసి 15 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. గత నెలకు, ఈనెలకు సంబంధించి తన ఖాతాకు జమ అయిన పెన్షన్ మొత్తంలో వ్యత్యాసం ఉండటంతో ట్రెజరీ అధికారులను అడిగి తెలుసుకునేందుకు కార్యాలయం వద్దకు వచ్చాడు. అదే సమయానికి ఓ అపరిచితుడు కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద నిల్చుని, శ్రీనివాసులును పలకరించాడు. వచ్చిన కారణమేంటని అడిగి తెలుసుకుని, కార్యాలయంలో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతోందని, మీ సమస్యను పరిష్కరించే ఉద్యోగి తానేనని, ప్రస్తుతం వివరాలు తనవద్ద ఇచ్చి వెళ్లాలని చెప్పాడు. తర్వాత పెన్షనర్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ.5లక్షల లోనుకు దరఖాస్తు చేసుకున్నారా అని అడిగాడు. అలాంటిదేమీ తనకు తెలియదని, ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేసుకోవాలని శ్రీనివాసులు అడిగారు. లోనుకు సంబంధించి ఇప్పటికే పెన్షనర్లకు నోటీసులు పంపామని, మీకు అందలేదా అని ప్రశ్నించాడు. ఈరోజే దరఖాస్తుకు చివరిరోజని, రూ.1లక్ష35వేలు డిపాజిట్ చెల్లిస్తే, మీ వివరాలను ఆన్‌లైన్ చేసి బాండు ఇస్తానని, దాన్ని తీసుకెళ్లి సబ్ కలెక్టరేట్‌లో అందజేస్తే రూ.5లక్షల చెక్కు ఇస్తారని నమ్మించాడు. అపరిచితుడిని ట్రెజరీ ఉద్యోగిగా నమ్మిన శ్రీనివాసులు, వెంటనే అల్లుడు మోహన్‌కు ఫోన్‌చేసి డబ్బులు తేవాల్సిందిగా కోరాడు. దీంతో మోహన్, రూ.లక్ష నగదు తీసుకుని వచ్చి శ్రీనివాసులుకు అందజేసి, మున్సిపాలిటీలో పని ఉందని చెప్పి వెళ్లిపోయాడు. శ్రీనివాసులు, ట్రెజరీ ఉద్యోగిగా నమ్మిన అపరిచితుడికి రూ.లక్ష అందజేశాడు. వెంటనే అతను ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్ తీసుకువచ్చి ఇవ్వాల్సిందిగా కోరాడు. శ్రీనివాసులు జిరాక్స్ కోసం కార్యాలయ ఆవరణలోని షాపు వద్దకు వెళ్లగానే, మరోవైపు నుంచి అపరిచిత వ్యక్తి రూ.లక్ష నగదుతో దర్జాగా ఉడాయించాడు. జిరాక్స్ కాపీలు తీసుకువచ్చిన శ్రీనివాసులుకు అపరిచిత వ్యక్తి కనిపించకపోవడంతో కంగారుగా కార్యాలయంలోకి వెళ్లి విచారించాడు. పెన్షనర్లకు రూ.5లక్షల లోన్లు ఏమీ లేవని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే అల్లుడు మోహన్‌కు ఫోన్‌చేసి పిలిపించి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులును, అపరిచితుడు మోసగించిన వైనం మొత్తం తహసీల్దార్ కార్యాలయ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అవడంతో, వన్‌టౌన్ పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి, అపరిచిత వ్యక్తిని వెతికే పనిలో పడ్డారు.
ట్రెజరీ ఉద్యోగినంటూ రిటైర్డ్ ఉద్యోగిని మోసగించిన వైనం


