అపార్‌కు..అవాంతరాలు
ప్రతిబంధకాలు ఇవీ..
రాయచోటి: విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచేందుకు కేంద్రం చేపట్టిన ఆటోమెటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) గుర్తింపు కార్డుల్లో వివరాల నమోదుకు జిల్లాలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రక్రియ ప్రారంభమై ఏడాది అవుతున్నా జిల్లాలో ఇంకా వందశాతం పూర్తికి నోచుకోలేదు. ఆధార్.. యూడైస్‌లలో విద్యార్థుల వివరాలు ఒకే రకంగా ఉంటేనే అపార్‌లో వివరాలు నమోదవుతున్నాయి. అయితే చాలా మంది వివరాలు తప్పుగా ఉంటుండటంతో యూడైస్, అపార్‌లలో పేర్లు నమోదు కావడం లేదు. ఈ కార్డులో విద్యార్థులు ఎక్కడ చదివారు, ఏ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి వంటి వ్యక్తిగత వివరాలతో పూర్తి సమాచారం ఉంటుంది. ఉన్నత చదువులు, ప్రాజెక్టులు, ఇంటర్వ్యూలు వంటి వాటికి అపార్ కార్డులోని విశిష్ట సంఖ్యను ఉపయోగించాల్సి ఉంటుంది.
పరిస్థితి ఇది..
జిల్లాలోని 2731 పాఠశాలల్లో 241305 మంది విద్యార్థులు, 157 ఇంటర్మీడియట్ కళాశాలలో 30035 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో పాఠశాలల్లో 212462 మంది అపార్ నమోదు చేసుకోగా ఇంకా 28843 మంది చేసుకోలేదు. 11, 12వ తరగతుల్లో 17058 మంది అపార్ నమోదు చేసుకోగా ఇంకా 12977 మంది చేసుకోలేదు. దీంతో జ్లిలాలో 84.28 శాతం మాత్రమే నమోదైనట్లు విద్యాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నమోదు విషయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అధికారులు యాజమాన్యాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో...
జిల్లాలో నియోజకవర్గాలు 6, మండలాలు, 30, పాఠశాలలు 2731, జూనియర్ కళాశాలలో 157, విద్యార్థుల సంఖ్య 271340 (ఒకటి నుంచి ఇంటర్ వరకు) అపార్ నమోదైన సంఖ్య 229520, అఫార్ పెండింగ్ 41820, మొత్తం 84.28 శాతం.
ఒకటి నుంచి ఐదోతరగతి..
114579 మంది విద్యార్థులకు 9833 అపార్ పూర్తి కాగా 16196 మందికి పెండింగ్‌తో 85.86 శాతం నమోదైంది. 6 నుంచి 8 వరకు 78589 మందికి 73310 మందికి పూర్తి కాగా 5279 మందికి పెండింగ్‌తో 92.11 శాతం పూర్తయ్యింది. 9,10 తరగతులు 48137 మందికి 40769 మంది పూర్తి చేసుకోగా 7368 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. 84.69 శాతం అయ్యింది. 11,12 తరగతుల్లో 300340 మందికి 229520 మంది అపార్ నమోదు చేసుకొని 41820 మంది ఇంకా చేసుకోవాల్సి ఉంది. దీంతో 56.79 శాతం మాత్రమే నమోదైనట్లు విద్యాశాఖ వివరాలు చెబుతున్నాయి.
అధికారులు ఏమంటున్నారంటే...
అపార్ నమోదు విషయంలో ఏర్పడుతున్న అవాంతరాలపై జిల్లా విద్యాశాఖ అధికారి కె సుబ్రమణ్యం, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిలు మాట్లాడుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేర్లు, ఇంటిపేర్లలో కొంత వ్యత్యాసాలు ఉండటం వల్ల ఆలస్యమవుతోంది. త్వరలోనే అందరి విద్యార్థులకు అపార్ నమోదును పూర్తి చేయిస్తామ్ననారు.
తల్లిదండ్రులు వారి పిల్లల పూర్తి వివరాలను ఉపాధ్యాయులకు అందించడం లేదు.
వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కుటుంబాల పిల్లలకు ఆధార్ కార్డులు లేవు.. ఇక్కడ పొందే వెసులుబాటు లేదు....
యూడైస్, ప్లస్‌లో ఉన్న వివరాలు ఆధార్ కార్డులో ఉన్న వాటిల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి.
ఆధార్ కార్డులోని తప్పులను సవరించుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు.
ఒకటికి మించి పాఠశాలల్లో చదివిన పిల్లల వివరాలు ఆయా పాఠశాలల్లో భిన్నంగా ఉంటున్నాయి.
విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు పాఠశాలల రికార్డుల్లో ఒక విధంగా ఆథార్, బ్యాంక్ ఖాతాల్లో మరోలా ఉంటున్నాయి.
పరీక్ష ఫీజు గడువు దగ్గర పడేకొద్దీ విద్యార్థుల్లో టెన్షన్
అపార్‌కు..అవాంతరాలు


