మదనపల్లె : టీకాల పేరుతో వీధి కుక్కలను సంహరిస్తున్నారని బెంగళూరుకు చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థకు చెందిన యాంటి క్రుయాలిటీ సెల్ ఆఫీసర్ కేవీ.హరీష్ తెలిపారు. మదనపల్లె తాలుకా పోలీసులకు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. హరీష్ వివరాల మేరకు.. స్థానిక ప్రశాంత్ నగర్, ఇందిరా నగర్‌లో మంగళవారం సాయంత్రం, రాత్రి 60 కుక్కలను చంపారని తెలిపారు. కొన్ని అమానవీయంగా తరలిస్తుండగా పట్టుకున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జంతు సంరక్షణ బోర్డు, పురపాలక అధికారుల ఎలాంటి అనుమతి లేకుండా పట్టుకోవడం చట్ట విరుద్ధమన్నారు. టీకాల పేరుతో కుక్కలను ఎక్కడికి తరలించారో నిర్ధారించాలని అధికారులను కోరారు. టాటాఏస్ వాహనంలోని కుక్కల్లో ఒకటి గర్భిణి అని, ఇందులో ప్రమేయం ఉన్న సిబ్బంది, అధికారులపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
అధికమైన బెడద
మదనపల్లె పట్టణంలో కుక్కల బెడద తీవ్రమైంది. గతంలో కంటే ప్రస్తుతం వాటి సంఖ్య రెంటింపు అయ్యింది. చిన్నపెద్దా తేడా లేకుండా దాడిచేసి కాటేస్తున్నాయి. వీటినుంచి రక్షించాలని ప్రజలు చాలాకాలంగా మున్సిపల్ అధికారులను మొరపెట్టుకుంటున్నారు. కౌన్సిల్ సమావేశాల్లోనూ దీనిపై పలుమార్లు చర్చ జరిగింది. అయితే ఇప్పుడు కుక్కలను పట్టడంపై చట్టాలను అనుసరించాల్సి ఉన్నందున అధికారులు ఎలాంటి చర్యలతో ముందుకు వెళ్తారో చూడాలి.
వాహనం పట్టుకున్న సంస్థ ప్రతినిధులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
