 
															● ప్రమాదకరంగా 32 చెరువుల ఆనకట్టలు..
రాయచోటి అర్బన్: కరువుకు కేరాఫ్ అడ్రస్ అయిన అన్నమయ్య జిల్లా తుపాను, అల్పపీడన ప్రభావంతో జలకళను సంతరించుకుంది. నిన్న, మొన్నటి వరకు జిల్లాలోని ఎక్కువ మండలాల్లో కనీసం తాగు, సాగు నీరు లేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మొంథా తుపాను ప్రభావంతో వర్షాలు కురిశాయి. జిల్లాలో 6 ప్రాజెక్టులు ఉండగా అందులో 4 ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయి నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. అయితే 2.239 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు 2021లో వచ్చిన వరదల వల్ల కొట్టుకుపోయింది. అయితే ఇంత వరకు అక్కడ ఎలాంటి నీటి నిలువ నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల వచ్చిన నీరు వృథాగా వెళ్లిపోయింది. వెలిగల్లు ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 4.640 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.824 టీఎంసీల నీరు నిలువ ఉంది. అలాగే పింఛా ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 0.327 టీఎంసీలు కాగా , ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. 0.489 టీఎంసీల నీటి నిలువ ఉన్న ఝరికోన ప్రాజెక్టు పూర్తిగా నిండి జలకళను సంతరించుకుంది. దీంతో పాటు 0.398 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న బహుదా రిజర్వాయర్, 0.540 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న పెద్దేరు రిజర్వాయర్‌లు కూడా పూర్తిగా నిండాయి.
607 చెరువులకు 25 శాతం
కూడా నీరు చేరని వైనం...
జిల్లాలోని 30 మండలాల పరిధిలో 3089 చెరువులు ఉండగా 522 చెరువులు పూర్తిగా నిండాయి. ఇంకా 607 చెరువులకు కనీసం 25 శాతం కూడా నీరు చేరకపోవడం గమనార్హం. 75 శాతం వరకు నీరు చేరిన చెరువులు 505 ఉండగా, 50 శాతం నీరు చేరిన చెరువులు జిల్లాలో 671 ఉన్నాయి. అలాగే 25 శాతం నీరు చేరిన చెరువులు 784 ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే కనీసం 25 శాతం కూడా నీరు చేరని చెరువులు ఇంకా జిల్లాలో 607 ఉన్నట్లు తెలుస్తోంది. చాలా వరకు చెరువులకు , కుంటలకు నీటిని అందించే కాలువలు, వాగులు, వంకలు ఆక్రమణలకు గురికావడం వల్ల ఆయా చెరువులకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఉన్న వాగులు, వంకలు, కాలువలు పూడికతో నిండిపోవడం వల్ల కూడా నీరు సక్రమంగా చెరువులకు చేరడం లేదని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు.
ప్రాజెక్టులు ఆయకట్టు నీటి నిలువ ప్రస్తుతం ఉన్న
(ఎకరాలలో) సామర్థ్యం నీటి నిలువ
(టీఎంసీలలో) (టీఎంసీలలో)
అన్నమయ్య 13,000 2.239 2021లో
తెగిపోయింది.
వెలిగల్లు 24,000 4.640 3.824
పింఛా 3,773 0.327 0.327
ఝరికోన 2,880 0.489 0.489
బహుదా 2,880 0.398 0.398
పెద్దేరు 4,300 0.560 0.560
జిల్లాలో పూర్తిగా నిండిన 4 ప్రాజెక్టులు
జిల్లాలో 3089 చెరువులు ఉండగా, పూర్తిగా నిండిన 522 చెరువులు
25 శాతం కూడా నీరు చేరని చెరువులు 607
ఆనకట్టలు బలహీనమై ప్రమాదకరంగా ఉన్న 32 చెరువులు గుర్తింపు
వెంటనే శాశ్వత మరమ్మతులు చేయాలంటున్న ఆయకట్టు రైతులు
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వస్తున్న వరదల వల్ల ఆనకట్టలు ప్రమాదకరంగా ఉన్న చెరువులు జిల్లాలో 32 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తుపాను ప్రభావం వల్ల ఎలాంటి నష్టం వాటిళ్లకుండా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆయా చెరువుల వద్ద తాత్కాలిక మరమ్మతులు చేయించారు. జిల్లాలోని పీలేరు మండలంలో పెద్ద చెరువు, పాపిశెట్టికుంట, మద్దిపట్లవానికుంట, కలకటవారి ఎగువ కుంట, కంబరాయనచెరువు, చుట్టుకుంటలు ప్రమాదకరంగా ఉన్నాయి. వాల్మీకిపురం మండలంలో సాకిరేవుకుంట, గుర్రంకొండ మండలంలో కుమ్మల కుంట, అక్కవారి కుంట, ఎగువచెల్లలు కుంట, నారాయణరావు కుంటలు, కలకడ మండలంలో జోగిరెడ్డికుంట, కేవీపల్లె మండలంలో కొత్తకుంట, ఆకుటుగానిఒడ్డు, మల్లునచ్చునికుంట, పేటచెరువు, చిన్న బట్టూరు చెరువు, గున్నిగాని కుంటలు ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. టి.సుండుపల్లె మండలంలో తిరుపతయ్య కుంట, తోపుల కుంట, బక్కరెడ్డికుంట, తిమ్మారెడ్డిచెరువులు, చిన్నమండెం మండలంలో చాకిరేవుకుంట, రామాపురం మండలంలో మద్దిగుబ్బవంక, నాగుల కుంట, ఎర్రకుంట, పెద్దవంకలు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా చెరువులు, కుంటల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకముందే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
 
							● ప్రమాదకరంగా 32 చెరువుల ఆనకట్టలు..
 
							● ప్రమాదకరంగా 32 చెరువుల ఆనకట్టలు..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
