నష్టం మిగిలింది !
సాక్షి రాయచోటి : మొంథా తుపాను ప్రభావం జిల్లాపై పడింది. అంతకుమునుపు వరుస తుపాన్లతో అల్లాడిపోతున్న అన్నదాతలకు గోరుచుట్టుపై రోకలిపోటులా వర్షం దెబ్బ తీస్తోంది. సుమారు వారానికి పైగా ప్రతిరోజు తుంపెర, జడివానతో పొలాలు ఆరక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. అయితే మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేని వర్షాలతో పలు పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు కూడా అక్కడక్కడా దెబ్బతిన్నాయి.
2250 ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో సాగులో ఉన్న పంటలు దెబ్బతింటున్నాయి. భూమి తడి ఆరకముందే వరుస తుపానుల ప్రభావంతో రైతుకు నష్టం వాటిల్లే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా కలికిరి, నందలూరు, రాజంపేట, ఇతర ప్రాంతాల్లో సాగు చేసిన వరి పంటపై దెబ్బ పడింది. సుమారు 2250 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఒక్క వరినే కాకుండా మిగతా పంటలపై కూడా తుపాను ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టమాటా సాగు చేసిన రైతులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో టమాటా కాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. దీంతో టమాటా పనికిరాకుండా పోతోంది. అయితే ఇంకోవైపు రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో అరటి, బొప్పాయి, మామిడి సాగులో ఉన్నప్పటికీ ఎడతెరిపి లేని వర్షంతో పొలాలు ఆరకపోతే చెట్లు దెబ్బతింటాయన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది.
రోడ్లకు దెబ్బ
జిల్లాలో కురిసిన వర్షాలతో పంచాయతీ రోడ్లతోపాటు ఆర్‌అండ్‌బీ రహదారులకు కూడా నష్టం వాటిల్లింది. ప్రధానంగా రేణిగుంట–కడప రహదారికి సంబంధించి రాజంపేట నుంచి రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా పల్లె ప్రాంతాలకు వెళ్లే రోడ్లు కూడా కోతకు గురయ్యాయి. అలాగే తంబళ్లపల్లె ప్రాంతంలో కూడా కొన్నిరోడ్లు దెబ్బతిన్నట్లు స్థానికుల సమాచారం. మొత్తానికి వర్షం నేపథ్యంలో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ శాఖకు కూడా కొంతమేర నష్టం వాటిల్లింది.


