3.4 మీటర్ల భూగర్భ జలాలు పెరుగుదల
– జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి : నెల రోజుల కాలంలో 3.4 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, నీటిపారుదల, విద్యా, హౌసింగ్ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం, పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన సమస్యల పరిష్కారం వాట్సప్ గవర్నెన్స్ ప్రజల నుంచి వివిధ అంశాలపై తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమయ్యే భూసేకరణ, రీ సర్వే, చిన్న తరహా నీటిపారుదల, స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై సమీక్ష జరిపారు. మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో 9,10వ తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. రాబోయే ఎండా కాలంలో భూగర్భజలాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. జిల్లాలో తుపాను తీవ్రత ఎక్కువగా లేనప్పటికీ అధికారులు, సిబ్బంది అన్ని రకాల చర్యలు తీసుకున్నారని, భవిష్యత్తులో ఇలాంటి తుపాను వచ్చే సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌ఓపీని తయారు చేసుకుని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


