ఉపాధి అక్రమాలకు చెక్
అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉండదు ..
రాయచోటి అర్బన్ : దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఇతర దేశాలకు వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఉపాధి కూలీలందరికీ ఈ–కేవైసీ చేయాలని డ్వామా అధికారులకు సూచించింది. దీంతో ఈ నెల 6వ తేదీ నుంచి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మండలాల్లో ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఉపాధి కూలికి సంబంధించిన ఆధార్ కార్డును వారి జాబ్‌కార్డుతో అనుసంధానం చేయడం మొదలైంది. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న టెక్నికల్, ఫీల్డ్ సిబ్బంది కూలీల వద్దకు వెళ్లి ఈ ప్రక్రియను చేస్తున్నారు. ఇప్పటి వరకు 78 శాతం కూలీలకు ఈ–కేవైసీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాబోవు రోజుల్లో ఈ–కేవైసీ చేసుకుంటేనే ఉపాధి పని కల్పించనున్నారు. జిల్లాలో మొత్తం జాబ్ కార్డులలో నమోదైన ఉపాధి కూలీలు 3,11,236 మంది ఉండగా , అందులో అక్టోబర్ 29వ తేదీ వరకు 2,43,112 మంది తమ ఆధార్, జాబ్ కార్డుల వివరాలతో ఉపాధి అధికారుల వద్ద కేవైసీ చేయించుకున్నారు. కూలీలకు సంబంధించిన అధార్ కార్డును కూడా అప్‌గ్రేడ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇంకా 68,124 మంది ఉపాధి కూలీలు ఈ– కేవైసీ మోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ చేయించుకోని వారికి పని కల్పించే అవకాశం లేదని చెబుతున్నారు.
ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ ఇలా ...
ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కోసం ఎన్‌ఆర్‌ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనే యాప్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కూలీలకు సంబంధించిన వివరాలు అధికారులు అందులో నమోదు చేస్తున్నారు. ఈ విధానంతో పారదర్శకతకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఒక జాబ్ కార్డుపై మరొకరు పనిచేసే విధానానికి స్వస్తి పలకవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
వయస్సు పైబడిన కూలీలకు తప్పని తిప్పలు..
వయస్సు పైబడిన వారితో పాటు కొంత మంది ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ నమోదు కాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. పలు సాంకేతిక కారణాలతో ‘ఐ బ్లికింగ్’ ప్రక్రియ జరగకపోవడం వల్ల అలాంటి వారు మళ్లీ మీ సేవ కేంద్రాలకు వెళ్లి, వారి ఆధార్ కార్డును అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మళ్లీ ఉపాధి అధికారుల వద్దకు వెళ్లి కేవైసీ చేయించాలి. ఈ విధంగా చేయడం చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం ఉపాధి కూలీలు 3,11,236
ఈ–కేవైసీ పూర్తి
చేసుకున్న కూలీలు 2,43,112
ఈ–కేవైసీ కాని
ఉపాధి కూలీలు 68,124
ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ తప్పనిసరి
నూతన విధానాన్ని తీసుకొచ్చిన
కేంద్ర ప్రభుత్వం
జిల్లాలో 78 శాతం కేవైసీ ప్రక్రియ పూర్తి , పెండింగ్‌లో మరో 22 శాతం
ఉపాధి కూలీల జాబ్ కార్డులను ఆధార్‌కార్డులతో అనుసంధానం చేసి, ఈ –కేవైసీ ప్రక్రియ చేయడం వల్ల ఉపాధిలో అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉండదు. దీంతో పాటు ఒకరి బదులు మరొకరు పని చేసేందుకు కూడా అవకాశం లేదు. ప్రతి రోజు పనికి వచ్చిన కూలీల శ్రీఐ బ్లికింగ్‌శ్రీతో హాజరు నమోదు చేస్తారు. దీంతో పనులన్నీ పారదర్శకంగా జరుగుతాయి. మరణించిన వారిని, ఇతర ప్రాంతాలలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తొలగిస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 78 శాతం కేవైసీ ప్రక్రియ పూర్తి చేశాం. త్వరలో మిగిలిన టార్గెట్‌ను చేరుకుంటాం. అలాగే రాబోవు రోజుల్లో ఉపాధి హామీలో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము. – టి.వెంకటరత్నం, డ్వామా పీడీ.


