రాయచోటికి అన్యాయం చేయొద్దు
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లాను ఇష్టారాజ్యంగా విభజించి రాయచోటికి అ న్యాయం చేయొద్దని, జిల్లాను యథాస్థితిగా కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన ఈమేరకు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. అన్నమయ్య జిల్లాను విభజించే ప్రయత్నాలు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయన్నారు. జిల్లాను రెండుగా విడదీయడం వల్ల భవిష్యత్తులో రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగడం ప్రశ్నార్థకమవుతుందన్నారు.
పార్లమెంటు ప్రాతిపదిక ప్రకారమే జిల్లాల పునర్విభజన జరిగిందన్నారు. అందులో భాగంగా దశాబ్దాలుగా అన్ని విధాలుగా వెనుకబడిన రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం అందరికీ ఆమోదయోగ్యమే అన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన దూరంగా ఉండటం, స్వల్ప కాలంలోనే ఆఫీసులన్నీ ఏర్పాటు కావడం , అన్ని జాతీయ రహదారులు అనుసంధానమై సౌకర్యంగా ఉందన్నారు. దీనికి తోడు పుంగనూరును కూడా జిల్లాలో విలీనం చేయడం సంతోషకరమేనన్నారు. ఇప్పుడు నాలుగు నియోజకవర్గాలను కలిపి మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజక వర్గాలను కలిపి జిల్లా కేంద్రంగా కొనసాగిస్తే ప్రజలకు ఇబ్బందులను తెచ్చి పెట్టడమే అన్నారు.
రాయచోటిని బలహీనపరిచే నిర్ణయం
మదనపల్లె ఒక అద్భుతమైన పట్టణమని, ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ జిల్లాకు మదనపల్లె ప్రాంతం గుండెకాయలాంటిదని, అన్ని రకాల సౌకర్యాలతో అభివృద్ధి చెందిన ప్రాంతమన్నారు. విద్య, వ్యాపార రంగాల్లోనూ బెంగళూరు నగరానికి దగ్గరగా ఉండడం ఇలా అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. జిల్లాను భౌగోళికంగా తగ్గించేస్తే రాబోవు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పనిచేయడానికి ఆసక్తి చూపరన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి గతంలో ఏర్పడిన అన్నమయ్య జిల్లాను యథావిధిగా కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి


