 
															సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త!
రాయచోటి : సైబర్ నేరాల ఉచ్చులో విద్యార్థులు, రైతులు చిక్కుకోకుండా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. వివిధ రూపాలలో వారు మోసాలకు పాల్పడుతున్న విషయంపై పత్రికా ప్రకటన ద్వారా వివరించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్ మంజూరైందని కాల్స్, మెసేజ్ చేస్తున్నారన్నారు. వెంటనే స్పందించి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ(వన్ టైమ్ పాస్‌వర్డ్) చెప్పమని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవల తుపాను, ప్రకృతి వైపరీత్యాలకు నష్ట పరిహారం ఇస్తామంటూ మొబైల్ ఫోన్‌కు తప్పుడు కాల్స్ చేస్తున్నారని వివరించారు. పరిహారం పేరుతో మోసగాళ్లు సున్నితమైన సమాచారాన్ని సేకరించి డబ్బు కాజేస్తున్నారని తెలిపారు. మీ పాస్ బుక్, బ్యాంక్ కాతా వివరాలలో ఆన్‌లైన్‌లో పొరపాట్లు ఉన్నాయి. వాటిని సరిదిద్దాలంటూ సైబర్ నేరగాళ్లు రైతులను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయమని, ఓటీపీ, బ్యాంక్ వివరాలను చెప్పమని అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వెల్లడించరాదని, తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని ఎస్పీ కోరారు. ప్రభుత్వం, బ్యాంకుల తరపున ఎవరూ ఎప్పుడూ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ వివరాలు, పిన్ నెంబర్, ఓటీపీ అడగరన్నారు. ఇటువంటి కాల్స్, మెసేజ్‌లు వచ్చిన వెంటనే అప్రమత్తమై వాటిని విస్మరించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వారు తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930, లేదా దగ్గరలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
