 
															ఉగ్ర దాడులను సమిష్టిగా ఎదుర్కొందాం
ఒంటిమిట్ట : ఉగ్రదాడులు జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై సోమవారం రాత్రి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మంగళగిరి నుంచి వచ్చిన ఆక్టోపస్ దళాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాల డీఎస్పీ కృష్ణ ముందుగా సోమవారం ఉదయం ఒంటిమిట్టలోని పోలీసులు, రెవెన్యూ, వైద్యం, అగ్నిమాపక, విద్యుత్, టీటీడీ, దేవస్థానం శాఖల అధికారులు, సిబ్బందితో స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో సమీక్షించారు. ఆక్టోపస్ దళాలు నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఒక కల్పిత ఉగ్రవాద బృందాన్ని ఏర్పాటు చేసి, వారి ద్వారా జన జీవనం అధికంగా ఉండే పలు చోట్ల ఉగ్రదాడులకు పాల్పడితే ఎలా ఉంటుందో సంఘటనలను సృష్టించి, అలాంటి సమయంలో దళాల ప్రతిస్పందన ఎలా ఉంటుందో పరీక్షించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల మధ్య సమన్వయం పెరిగితేనే ప్రజలకు భద్రత ఉంటుందన్నారు. ఇన్‌స్పెక్టర్ గోపిచంద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట తహసీల్దార్ దామోదర్ రెడ్డి, సీఐ బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, ఆలయ విజిలెన్స్ విభాగం పర్యవేక్షకుడు గంగులప్ప, వైద్య, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
