 
															కూటమి నేతల భూ దాహం !
● కోట్లు విలువ చేసే ఇంటి స్థలాలు
కబ్జా చేస్తున్న టీడీపీ నాయకులు
● పట్టించుకోని రెవెన్యూ, పోలీసు అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : కోడూరు పట్టణం నడిబొడ్డున శివరామకృష్ణ థియేటర్ వెనుక లక్ష్మీనగర్‌లో కోట్ల రూపాయలు విలువచేసే భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 30 ఏళ్ల క్రితం రైల్వేకోడూరు, ఓబులవారిపల్లి గ్రామాల ప్రజలు ఇంటి స్థలాల ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రైల్వేకోడూరు పట్టణానికి చెందిన ద్వితీయ శ్రేణి తెలుగుదేశం పార్టీ నాయకుల కన్ను ఈ విలువైన కోట్లాది రూపాయల భూమిపైన పడింది. స్థానిక దళితవాడ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో కుమ్మకై ్క సంబంధిత భూమిలో అక్రమంగా కంచెను ఏర్పాటు చేశారు. కంచెను తొలగించేందుకు ఆదివారం ఇంటి స్థలాలకు సంబంధించిన లబ్ధిదారులు పెద్దఎత్తున జేసీబీ సహాయంతో ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, బినామీలు జేసీబీని అడ్డుకున్నారు. దీంతో లబ్ధిదారులకు, దళితవాడ గ్రామ ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. సర్వే నెంబరు. 13/1,13/7,13/13/5లలో దాదాపు ఏడు ఎకరాల భూమిని 200 మందికి పైగా ఇంటిస్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నారు. ఈ స్థలాన్ని 1917వ సంవత్సరంలో రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సోడిశెట్టి శేషయ్య రిజిస్టర్ చేయించుకొని మామిడిచెట్లు నాటారు. అనంతరం మామిడిచెట్లు తొలగించి శేషయ్య వారసులు ఇంటి స్థలాలుగా విక్రయించారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఓబులవారిపల్లి, మంగంపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, రైల్వేకోడూరుకు చెందిన పారిశ్రామిక వేత్త, విద్యాసంస్థల అధినేత, మరో టీడీపీ నాయకుడి కన్ను ఈ భూమిపై పడింది. ఎలాంటి ఆధారం లేకపోయినా అక్రమ పత్రాలు సృష్టించి దళితులను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు విలువచేసే ఇంటిస్థలాలు కాజేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు, రెవెన్యూ, పోలీసు అధికారులు భారీ ఎత్తున మామూళ్లు తీసుకొని తమకు అన్యాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షలు అప్పు చేసి కొన్న ఇంటిస్థలాలను అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకొని కబ్జాకు పాల్పడుతున్నారని, ఆదుకోవాలని లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని అర్హులైన భూమి యజమానులు అంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
 
							కూటమి నేతల భూ దాహం !

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
