రాజంపేట : రాజంపేట–రాయచోటి రోడ్డులోని పాలకేంద్రం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి కొనిరెడ్డి మహేంద్రరెడ్డి మృతి చెందాడు. నగరవనం నుంచి బైకులో వస్తూ పాలకేంద్రానికి ఎడమవైపు ఉన్న ఎంజీఆర్ ఐరన్ హోర్డింగ్‌ను బలంగా ఢీ కొట్టాడు. బైకు రైడర్ మహేంద్రకు రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న స్నేహితునికి స్వల్ప గాయాలు అయ్యాయి. సీఐ నాగార్జున మాట్లాడుతూ రాజంపేట పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హెల్మెట్ ధరించాలన్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం, అతివేగంగా బైకులను నడపటం ప్రమాదకరమన్నారు. ఒక్కసారి విద్యార్థులు తమ కుటుంబం, తల్లిదండ్రులను గుర్తుంచుకొని, బైకులు జాగ్రత్తగా నడపాలన్నారు. ఈ ప్రమాదంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన విద్యార్థిని సీఐ నాగార్జున, ఎస్‌ఐలు పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మదనపల్లె సహకార గృహ నిర్మాణ సంఘ కార్యవర్గ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
రాయచోటి జగదాంబసెంటర్ : మదనపల్లె పట్టణంలోని మదనపల్లె సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్‌కు నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొనేందుకు నోటిఫికేషన్‌ను ఈ నెల 18వ తేదీన విడుదల చేసినట్లు ఎన్నికల అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 22న నామినేషన్ల స్వీకరణ, 23న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ, 24న నామినేషన్ల తుది జాబితా సాయంత్రం 5 గంటల తరువాత ప్రకటన, 29న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మదనపల్లెలోని రామాలయం వీధి సొసైటీ కాలనీలో గల నెహ్రూ మున్సిపల్ ప్రైమరీ, హైస్కూల్‌లో ఉంటుందన్నారు. ఈ నెల 30న అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు.
ఆక్రమణకు యత్నించిన వ్యక్తులపై కేసులు నమోదు
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ భూముల ఆక్రమణకు యత్నించిన వ్యక్తులపై తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. మండలంలోని కోళ్లబైలు పంచాయతీ సర్వే నెంబర్.599/4లోని ప్రభుత్వ స్థలం స్వరూప స్వభావాలు మార్చి చదును చేసేందుకు ప్రయత్నించిన పట్టణంలోని నీరుగట్టువారిపల్లె గజ్జలకుంటకు చెందిన కె.శ్రీనివాసులు, భాస్కర్‌పై కేసు నమోదు చేశామన్నారు. అదే విధంగా కోళ్లబైలు పంచాయతీ సర్వేనెంబర్.598/3, 599/2 లోని ప్రభుత్వ స్థలాన్ని రాయచోటి కృష్ణాపురానికి చెందిన వలిపి సిద్ధయ్య, నీరుగట్టువారిపల్లె గజ్జలకుంటకు చెందిన నాగమల్లు.. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి, ప్రభుత్వ స్థలాన్ని చదునుచేసి ఆక్రమించేందుకు ప్రయత్నించారన్నారు. తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బాలికపై మేనమామ వేధింపులు
కై కలూరు : మేనమామ వేధించడంతో పాటు తల్లి, అమ్మమ్మ, తాత చిత్రహింసలకు గురిచేశారని 9వ తరగతికి చెందిన బాలిక బావురుమంది. నరకం నుంచి బయటపడ్డానని గాయాలను చూపించింది. ఈ ఘటన ఏలూరు జిల్లా కై కలూరు మండలం చటాకాయికి చెందిన బాలికపై వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సమీప అగ్రహారంలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం ఆమెను తండ్రి కై కలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చాడు. పోలీసులకు ఆమె వివరాలు వెల్లడించింది. బాధితురాలు, ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. చటాకాయికి చెందిన జయమంగళ కుమార అభిమన్యుడుకి ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన కామాక్షితో 2009లో వివాహమైంది. వీరికి 2012లో అమ్మాయి జన్మించింది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కుమార్తె తండ్రి వద్ద ఉంటోంది. కామాక్షి మరో వ్యక్తిని వివాహం చేసుకోగా.. అభిమన్యుడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె (14) తండ్రి వద్దే ఉంటూ భుజబలపట్నంలో 9వ తరగతి చదువుతోంది.
దసరా పండక్కి తీసుకెళ్లి:తండ్రి లేని సమయంలో కామాక్షి, ఆమె తల్లి చటాకాయలో ఉంటున్న బాలిక వద్దకు వచ్చి దసరా పండగకు దుస్తులు కొంటామని ప్రత్తికోళ్లలంక, అక్కడ నుంచి కామాక్షి సోదరుడు ఉమాశంకర్, తల్లిదండ్రులు నాగులమ్మ, వెంకటరమణ ఉంటున్న కడప జిల్లా బద్వేలుకు తీసుకువెళ్లారు. బాలికను అక్కడే ఉండాలని బలవంతం చేయడంతో ఆమె నిరాకరించి తండ్రి వద్దకు వెళతానని చెప్పింది. దీంతో తన తల్లి కామాక్షి ఇష్టానుసారం తనను కొట్టిందని బాలిక వాపోయింది. మేనమామ ఉమాశంకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు చెప్పింది. బద్వేలులో బాలిక పరిస్థితిని చూసిన ఓ వ్యక్తి తండ్రి అభిమన్యుడికి ఫోన్ చేయగా అక్కడికి వెళ్లి శుక్రవారం రాత్రి చటకాయకు తీసుకువచ్చారు.