
కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి
బి.కొత్తకోట : బి.కొత్తకోటకు సమీపంలోని బాలసానివారిపల్లెలో శనివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేసి విచక్షణారహితంగా కొరకడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. బాలసానివారిపల్లెకు చెందిన ఎం.బాబు గొర్రెల పెంపకంతో జీవిస్తున్నాడు. శనివారం వర్షం కురవడంతో గొర్రెలను గ్రామంలోనే గొర్రెలదొడ్డిలో వదిలి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎక్కడినుంచో వచ్చిన వీధి కుక్కలు గొర్రెలదొడ్డిలోకి దూరి గొర్రెలపై దాడి చేశాయి. దీంతో 50 గొర్రెలు మృతి చెందగా రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. మూడు నెలల క్రితం ఇలాగే బాబుకు చెందిన 11 గొర్రెలను కుక్కలు కొరికి చంపేయగా రూ.లక్ష నష్టం జరిగింది. ఇప్పుడు మళ్లీ 50 గొర్రెలు చనిపోవడంతో తనకు దిక్కేది అంటూ ఆవేదన చెందుతున్నాడు. కాగా బాలసానివారిపల్లె సమీపంలోని కమ్మోరుపల్లెలో మూడు రోజుల క్రితం కుక్కలు దాడి చేయడంతో హరి అనే వ్యక్తికి చెందిన 12 గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధితునికి రూ.1.20 లక్షల నష్టం వాటిల్లింది. వీధి కుక్కలను అదుపుచేసి గొర్రెలను కాపాడాలని రైతులు అధికారులను కోరుతున్నారు.