
తవ్వేశారు.. బిల్లు చేసుకుని పూడ్చేశారు
● ఫారంపాండ్ పేరుతో తెలుగు తమ్ముళ్ల అక్రమార్జన
● వాటర్‌షెడ్‌లో రూ.లక్షల ప్రజాధనం
దుర్వినియోగం
పెద్దతిప్పసముద్రం : కూటమి ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్లు అధికారులను కను సైగలతో శాసిస్తూ లక్షల రూపాయల ప్రజా ధనం దోచేస్తున్నారు. సొంత భూములు కలిగిన రైతులకు సమాచారం ఇవ్వకుండా బినామీ పేర్లతో రైతుల పొలాల్లో ఫారంపాండ్ పనులు చేపట్టి బిల్లులు చేసుకున్నాక గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేస్తున్నారు.
మండలంలోని సంపతికోట పంచాయతీ కొత్తపల్లికి చెందిన పి.రామలక్ష్మమ్మ పేరిట ఎలాంటి వ్యవసాయ భూములు లేవని సమాచారం. అయితే అదే పంచాయతికి చెందిన వల్లీసాబ్‌కు బోడిగుట్ట సమీపంలో ఖాతా నంబర్ 820లో అసైన్‌మెంట్ భూమి ఉంది. ఆయన కుటుంబీకులు బెంగళూరులో ఉంటూ నెలకోసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు వల్లీసాబ్ పొలంలో వాటర్‌షెడ్ ద్వారా మూడు నెలల కిందట ఫారంపాండ్ నిర్మించి బిల్లులు చేసుకోవాలని తలపెట్టారు. అనుకున్న వెంటనే పని గుర్తింపు సంఖ్య 20083లో రూ.1.85 లక్షల అంచనాతో పనులు పూర్తి చేశారు. భూమే లేని పి.రామలక్ష్మమ్మ పేరిట వల్లీసాబ్ పొలంలో చేసిన పనులకు బిల్లులు చేసుకున్నారు. వారం రోజుల కిందట వల్లీసాబ్ వచ్చి తన పొలం వద్ద ఫారంపాండ్ పనులు చూసి అవాక్కయ్యాడు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా పనులెలా చేపట్టారని కూటమి నాయకులను గట్టిగా నిలదీశాడు. ఇక చేసేది లేక తెలుగు తమ్ముళ్లు మూడు రోజుల కిందట జేసీబీ యంత్రాన్ని రప్పించి ఫారంఫాడ్‌ను గుట్టుగా పూడ్చేశారు. లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి.
నిధులను రికవరీ చేయాలి
వాటర్‌షెడ్ ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలి. ఫారంపాండ్ పనికి మంజూరు చేసిన ప్రజాధనాన్ని అధికారులు రికవరీ చేయాలి. కమిటీల ఆమోదం లేకుండా అధికారులను బెదిరించి బిల్లులు చేసుకోవడం పద్ధతి కాదు. సెంటు భూమి కూడా లేని బినామీల పేరిట బిల్లులు చేసుకోవడం సబబుకాదు. రైతులు, కమిటీలు, అధికారుల ఆమోదంతో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపట్టాలి.
–రఘునాథ్‌రెడ్డి, వాటర్‌షెడ్ ఛైర్మన్, సంపతికోట

తవ్వేశారు.. బిల్లు చేసుకుని పూడ్చేశారు

తవ్వేశారు.. బిల్లు చేసుకుని పూడ్చేశారు

తవ్వేశారు.. బిల్లు చేసుకుని పూడ్చేశారు