
ఆడ బిడ్డలను కాపాడుకుందాం
రాయచోటి టౌన్ : సీ్త్ర లేనిదే సృష్టి లేదు.. అందుకే ఆడ బిడ్డలను కాపాడుకుందామని సీ్త్ర సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణంలో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీగా వచ్చి బంగ్లా సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఆడబిడ్డల చదువు ...ఇంటికే వెలుగును ఇస్తుందన్నారు. సీ్త్ర విద్యావంతురాలు అయితే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులేగాక అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించాలని, ఆడబిడ్డలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. బ్రూణహత్యలు నియంత్రించి ఆడ శిశువులను కాపాడుకొనే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. అంతకు ముందు బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహాక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరావు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.