
లక్షల్లో నగదు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపణ
మదనపల్లె రూరల్ : ఆర్థిక లావాదేవీల్లో భాగంగా లక్షల రూపాయల నగదుతో పాటు బంగారు నగలు, విలువైన ఆస్తి పత్రాలు తీసుకుని ఓ ప్రైవేట్ ఉద్యోగి, అతడి భార్య తనను నిలువునా మోసం చేశారని, అడిగితే ఇవ్వకపోగా..తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని హిజ్రా స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలోని ముజీబ్ నగర్‌లోని ప్రైవేట్ ఉద్యోగి ఇంటి ఎదుట మంగళవారం సాయంత్రం హిజ్రా బైఠాయించి నిరసనకు దిగింది.
బాధితురాలి వివరాల మేరకు...పట్టణంలోని చీకలిగుట్ట గౌతమీ నగర్‌లో భర్త దుర్గాప్రసాద్‌తో కలిసి చీటీలు వేసుకుని హిజ్రా స్వాతి జీవనం సాగిస్తోంది. ఐదేళ్ల క్రితం తన స్నేహితురాలు చంద్రకళ..ముజీబ్ నగర్‌కు చెందిన ప్రైవేట్ కాలేజీ క్యాషియర్, వడ్డీ వ్యాపారి ఢమరేశ్వర్, అతడి భార్య స్వర్ణలత వద్ద రూ.30 లక్షలు అప్పు తీసుకోగా హిజ్రా స్వాతి పూచీ పడింది. అనంతరం చంద్రకళ వడ్డీ, అసలు కట్టలేక ఐపీ పెట్టి వెళ్లిపోయింది. స్నేహితురాలు చంద్రకళకు పూచీ పడిన స్వాతిని అప్పు చెల్లించాల్సిందిగా ఢమరేశ్వర్ దంపతులు ఒత్తిడిచేశారు. ఈ క్రమంలో తన కష్టార్జితంతో పాటు, ఇతరుల నుంచి పెద్ద మొత్తంలో అప్పుచేసి, విడతల వారీగా ఫోన్ పే ద్వారా రూ.34లక్షలు, అకౌంట్ ద్వారా రూ.8లక్షలు, నగదు రూపేణా రూ.23లక్షల90వేలు, 600 గ్రాముల బంగారు ఇచ్చినట్లు స్వాతి తెలిపారు. వ్వడం జరిగిందన్నారు.
స్నేహితురాలు చేసిన అప్పును వడ్డీతో సహా చెల్లించినప్పటికీ, తాను వారికి ఇచ్చిన నగదు, బంగారు, ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాలని అడిగితే.. ఇవ్వకపోగా, వేధింపులకు గురిచేశారన్నారు. టూటౌన్ పోలీసులను ఆశ్రయిస్తే,..పోలీసుల ఎదుట ఇచ్చేస్తామని అంగీకరించి అనంతరం మొండికేశారన్నారు. అంగబలం, ఆర్థిక బలాన్ని ఉపయోగించి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాకుండా చేశారని, నగదు, డబ్బులు అడిగితే...రెండు రోజుల క్రితం ఎస్టేట్ సమీపంలో తనపై ఢమరేశ్వర్, అతడి భార్య స్వర్ణలత దాడికి పాల్పడ్డారన్నారు. దాడి విషయం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి, సీసీ ఫుటేజీ ఆధారాలను అందించినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లో తనకు అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవడంతో ఢమరేశ్వర్ ఇంటి ఎదుట బైఠాయించినట్లు తెలిపింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరింది.