
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడికి జైలుశిక్ష
కేవీపల్లె : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఓ నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి ఆర్‌ఎస్‌ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తి తీర్పనిచ్చారని ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 2018లో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా అప్పటి కేవీపల్లె ఎస్‌ఐ కెబి.శివకుమార్ ఐదుగురు నిందితులను పట్టుకుని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదికను తిరుపతి ఆర్‌ఎస్‌ఎస్ ఏడీజే కోర్టుకు సమర్పించారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఎ1 ముద్దాయిగా ఉన్న కలకడ మండలం ముడియంవారిపల్లెకు చెందిన గడ్డం రవికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్.కృష్ణమోహన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.అమరనారాయణ, అప్పటి ఎస్‌ఐ కెబి.శివకుమార్, ప్రస్తుత ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప, సీఐ లక్ష్మన్న, కానిస్టేబుళ్లు కె.ఆదినారాయణ, కె. శ్రీనివాసులలకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.