
రుషి వాటికలో డీఎంహెచ్‌ఓ విచారణ
బి.కొత్తకోట : మండలంలోని రుషి వాటిక వేదవ్యాస పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య మంగళవారం విచారణ జరిపారు. అక్కడ చదువుకొంటున్న లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన విద్యార్థి శేషాద్రిరెడ్డి కుడి కంటికి గాయమై చూపు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసు కేసు నమోదైంది. ఇందులో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో లక్ష్మీనరసయ్య ఆచార్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించారు. గాయపడిన విద్యార్థికి ఘటన జరిగిన సమయంలో అందించిన వైద్య సాయంపై ఆరా తీశారు. రుషివాటికలో ఉన్న అత్యవసర వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ ఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. ఆయన మాట్లాడుతూ ఈ విచారణ నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు చెప్పారు. గాయపడిన విద్యార్థికి అవసరమైన వైద్య సాయం అందిస్తామని చెప్పారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీధర్, టీబీ సూపర్‌వైజర్ ప్రభాకర్, ఆరోగ్య సిబ్బంది విజయలక్ష్మి, రెడ్డెమ్మ, ప్రమీల పాల్గొన్నారు.