
టమాటా రైతులకు అన్యాయం
రాయచోటి టౌన్ : టమాటా మండీ వ్యాపారులను రైతులకు అన్యాయం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి సీపీఐ జల్లా కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ గుర్రకొండ మార్కెట్‌కు టమాటా దిగుబడులు తీసుకెళ్లితే వంద బాక్సులకు 20 బాక్స్‌లు జాక్‌పాట్ అంటూ పక్కకు తీసేస్తున్నారన్నారు. డబ్బులు చెల్లించకుండా మిగిలిన 80 బాక్స్‌లకు వేలం పాడి డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేస్తే తమ టమాటా దిగుబడులు కొనరేమోనని రైతులు భయపడుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి మండి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు హరినాథ నాయుడు, అంజాద్ ఆలీఖాన్, నవీన్‌కుమార్ రెడ్డి, షబ్బీర్ బాషా, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
పుల్లంపేట : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం అన్నారు. మండలంలోని ఆదర్శ, కస్తూర్భా, బాలికల పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. ప్రయోగాలు ద్వారా బోధన చేయడంతో విద్యార్థులకు విషయం క్షుణ్ణంగా అవగతమవుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు కెరీర్ గైడ్‌లైన్‌ను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు చక్రధర్ రాజు, నాగ తిరుమలరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

టమాటా రైతులకు అన్యాయం