
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ అదుపు తప్పి ఇద్దరు కర్ణాటక వాసులు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. కర్ణాటక హవేరి ప్రాంతానికి చెందిన మల్లికార్జున(33), కనకపురకు చెందిన ముత్తురాజ్(32) ఎలక్ట్రానిక్ సిటిలో డీమార్ట్‌లో పని చేస్తుంటారు. ఇద్దరూ కలిసి శనివారం ద్విచక్రవాహనంలో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరుమల నుంచి బెంగళూరుకు బైక్‌లో తిరుగుప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో తిరుపతి–మదనపల్లె హైవేలోని పాలెంకొండ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ముత్తురాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
పీలేరు రూరల్ : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. పీలేరు పట్టణం బోయపాలెం వీధిలో కాపురం ఉంటున్న నాసిర్ భార్య ఖైరున్నీసా (48) అనారోగ్యంతో కొంత కాలంగా బాధపడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యానుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కలికిరి(వాల్మీకిపురం) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన శనివారం రాత్రి వాల్మీకిపురం మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మదనపల్లి పట్టణం ఈశ్వరమ్మకాలనీకి చెందిన నాగయ్యగారి మణికంఠ(27) తన ద్విచక్రవాహనంలో తిరుపతికి వెళ్లి మదనపల్లికి తిరుగు పయనమయ్యారు. మార్గంమధ్యలో వాల్మీకిపురం మండలం చింతలవారిపల్లి వద్ద తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిపై బైక్, ముందు వెళుతున్న వాటర్ టాక్టరు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వాల్మీకిపురం పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరికి గాయాలు