
ఇద్దరిపై కేసు నమోదు
కేవీపల్లె : మైనర్ బాలిక ప్రసవించిన ఘటనపై ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని బసన్నగారిపల్లెకు చెందిన మైనర్ బాలిక(16) తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. తల్లి జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన వరుసకు అన్న అయిన నాగేంద్ర అలియాస్ నాని ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను లోబరచుకుని లైంగిక దాడికి పాల్పడాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ నెల 7న పురిటి నొప్పులు రావడంతో పీలేరులోని మాధవి అస్పత్రికి తరలించారు. 8న బాలికకు కాన్పు చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం బిడ్డను స్వాధీనం చేసుకుని రాయచోటి శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి తరలించారు. ఐసీడీఎస్ సీడీపీవో రాజమ్మ ఫిర్యాదు మేరకు లైంగిక దాడికి పాల్పడిన నాగేంద్రపైనా, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా కాన్పు చేసిన డాక్టర్ మాధవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సంబేపల్లె : మండలంలోని దేవపట్ల కస్పాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిక్కం క్రిష్ణారెడ్డి (65) మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకొంది. పోలీసుల వివరాల మేరకు.. కట్టుగుత్తపల్లెకు చెందిన క్రిష్ణారెడ్డి స్కూటర్‌లో సొంత పనుల నిమిత్తం దేవపట్లకు వెళ్లి తిరిగి వస్తున్నారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఆవులవాండ్లపల్లె క్రాస్ వద్ద కలకడ వైపు నుంచి ద్విచక్ర వాహనం వస్తోంది. ఇరు వాహనాలు ఢీకొనడంతో క్రిష్ణారెడ్డికి గాయాలయ్యాయి. తిరుపతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని చనిపోవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దిగువగొట్టివీడులో చోరీ
చిన్నమండెం : చిన్నమండెం మండలం దిగువగొట్టివీడు గ్రామంలో పట్టపగలే చోరీ జరిగిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. దిగువగొట్టివీడుకు చెందిన వేణుగోపాల్ నాయు డు పొలం పనులకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు శనివారం మధ్యాహ్నం ఇంట్లో చొరబడి చోరీ చేశారు. విషయం తెలుసుకుని బాధితుడు వేణుగోపాల్‌నాయుడు హుటాహుటిన ఇంటికి చేరుకుని పరిశీలించారు. రూ.50 వేల నగదు, తులం బంగారు చోరీకి గురైందని గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నారు.
ఇసుక ట్రాక్టర్ ఢీకొని
ఒకరికి గాయాలు
సుండుపల్లె : మండలంలోని మిట్టబిడికి కాలనీలో శనివారం మధ్యా హ్నం జరిగిన ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలలోకి వెళ్లితే.. నాగేశ్వర నాయ క్ గొర్రెలు మేపుతుండగా వెనుక వైపు నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్ అతన్ని ఢీకొంది. నాగేశ్వరనాయక్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.
డాబా హోటల్‌పైకి
దూసుకెళ్లిన బొలెరో
గుర్రంకొండ : డాబా హోటల్‌పైకి వేగంగా వెళుతున్న ఓ బొలెరో వాహనం దూసుకెళ్లిన సంఘటన మండలంలోని గుర్రంకొండలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక మార్కెట్ యార్డు సర్కిల్లో పెద్ద ఎత్తున డాబాహోటళ్లు నిర్వహించుకొంటూ పలువురు జీవనం సాగిస్తున్నారు. గత శుక్రవారం రాత్రి మదనపల్లె నుంచి బయలుదేరిన ఓ బొలెరో వాహనం వేగం డ్రైవర్ అదుపు చేయలేక ఓ డాబా హోటల్‌పైకి దూసుకెళ్లాడు. డాబా పక్కనే ఉన్న పెద్దమండ్యం మండలానికి చెందిన మరో బొలెరో వాహనం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో నిలబడిపోయింది. రాత్రి వేళ డాబా మూసి ఉండడతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరిపై కేసు నమోదు

ఇద్దరిపై కేసు నమోదు