
వైద్యుల నిర్లక్ష్యం.. పురిటి బిడ్డ మృతి
మదనపల్లె రూరల్ : గర్భం దాల్చి ప్రసవానికి వస్తే.. వైద్య సిబ్బంది తోచిన విధంగా కాన్పు చేయడంతో పురిటి బిడ్డ మృతి చెందిన ఘటన మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె కుమ్మరవీధికి చెందిన మేసీ్త్ర ప్రసాద్ తన భార్య కవిత(35)కు పురిటినొప్పులు రావడంతో ప్రైవేట్ వాహనంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సింగ్ సిబ్బంది కవితను పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉదయం ఐదు గంటల సమయంలో నొప్పులు అధికమవడంతో కవితను కాన్పు గదికి తీసుకెళ్లారు.
పది గంటల వరకు సిబ్బంది చికిత్స చేసి ఆడబిడ్డను బయటకు తీశారు. పుట్టిన బిడ్డలో చలనం లేక పోవడంతో వైద్యులకు సమాచారం అందించారు. అప్పుడు వచ్చిన వైద్యుడు బిడ్డను పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం, బిడ్డ 3.6 కిలోల బరువు ఉండడంతో మృతి చెందిందని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భవతి అడ్మిషన్‌లో ఉన్నా వైద్యులు ఒకసారీ పరీక్షించలేదని, వారు అందుబాటులో ఉండి చికిత్స అందించి ఉంటే బిడ్డ దక్కేదని కుటుంబ సభ్యులు విలపించారు. డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేకపోవడం వల్లే తమ బిడ్డ మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయంచేయాలని బాధితులు కోరారు.
విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
పురిటి బిడ్డ మృతి, వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి వచ్చినపుడు తల్లి గర్భంలోని బిడ్డ పరిస్థితి బాగా ఉండడంతో నార్మల్ డెలివరీ అవుతుందని భావించి వైద్య సిబ్బంది ప్రయత్నించారు. బిడ్డ అధిక బరువు ఉండడం, ఉమ్ము నీరు తాగడం, చాలా ఏళ్ల తర్వాత రెండో కాన్పు రావడ వంటి కారణాలతో బిడ్డ మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. విచారించి చర్యలు తీసుకుంటాం.
– షుకూర్, ఆర్‌ఎంఓ, జిల్లా ఆస్పత్రి, మదనపల్లి
టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
ఆస్పత్రికి వచ్చిన కవిత, మృతి చెందిన పురిటిబిడ్డ

వైద్యుల నిర్లక్ష్యం.. పురిటి బిడ్డ మృతి