
గాలివీడులో కుండపోత వర్షం
గుంతలమయైన రోడ్డులో వస్తున్న పాదచారులు వెలిగల్లు జలాశయానికి జలకళ
గాలివీడు : వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో గాలివీడు మండలంలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. 108.4 మిల్లీ మీటర్లుగా నమోదైందని ఏఎస్‌ఓ శ్రీదుర్గ తెలిపారు. ఈ వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహించాయి. వెలిగల్లు జలాశయానికి వదర ప్రవాహం పెరగడంతో 3.027 నీటిమట్టం టీఎంసీలకు చేరుకుందని డీఈ శిరీష్‌కుమార్ తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 4.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.11 టీఎంసీలకు చేరింది. మండలంలోని గోరాన్ చెరువు నుండి వడిశలంకపల్లి వరకూ వరద నీరు పెరగడంతో పెద్ద చెరువుకు నీరు చేరింది. ఎల్లంపల్లి కుషావతి రిజర్వాయర్ నుంచి నడింపల్లి మీదుగా వచ్చే ప్రవాహంతో చిన్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
రాకపోకలకు అంతరాయం
తంబళ్లపల్లె: వర్షాలకు మండలంలోని ములకలచెరువు రోడ్డు నుంచి గోపిదిన్నెకు వెళ్లే రోడ్డు చిన్నేరు మొరవనీటితో కొట్టుకుపోయింది. కోతకు గురికావడంతో వాహనాలు, పాదచారుల రాకపోకలకు అంతరాయం కలిగింది. వేపలపల్లె, అనగలవారిపల్లె, దిగువపల్లె, దిన్నెమీదపల్లె, మెరుసుపల్లి బురుజు ,కె.బి.తాండా, రాగిమానుదిన్నె నుంచి ప్రజలు నిత్యం తంబళ్లపల్లెకు ఈ రోడ్డు మార్గంలోనే రావాల్సి వుంది. గతంలో ఇక్కడ ద్విచక్ర వాహనం బోల్తాపడి చిన్నారి నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన చేసుకుంది. ప్రస్తుతం రోడ్డు కోతకు గురికావడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కల్వర్టు ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

గాలివీడులో కుండపోత వర్షం