
ఈతకు వెళ్లి వ్యవసాయ విద్యార్థి మృతి
మహానంది : ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం బలిగొంది. మహానంది సమీపంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి పాలేరు వాగులో నీట మునిగి మృతి చెందాడు. మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలం జిల్లెలమంద సమీపంలోని పెద్దతాండకు చెందిన బి.జనార్ధన్‌నాయక్ (21) మహానంది సమీపంలోని వ్యవసాయ కళాశాలలో మూడో సంవత్సవరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం కళాశాల సమీపంలోని పాలేరువాగు వద్దకు తోటి విద్యార్ధులతో కలిసి వెళ్లాడు. అక్కడ కొంత మంది దుస్తులను శుభ్రం చేసుకోవడంతో పాటు ఈతకు దిగారు. ఈ క్రమంలో ఐదారుగురు ఈతకు దిగగా సరిగా ఈత రాని జనార్ధన్ నాయక్ వాగులోకి దిగాడు. కొద్ది సేపటికి పక్కనే ఉన్న అతను కనిపించకపోవడంతో మిగిలిన విద్యార్థులు అన్వేషించగా అక్కడే లోతు ఉన్న గుంతలో అపస్మారక స్థితిలో కనిపించాడు. బయటికి తీసి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.