
డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి
మదనపల్లె రూరల్ : బైక్‌ను వేగంగా నడుపుతూ, వాహనాన్ని అదుపుచేయలేక, డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న పవన్‌కుమార్, పల్లవి దంపతుల కుమారుడు మల్లెపూల అజయ్‌దేవా(19) స్థానికంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో డెలివరీ అమౌంట్‌ను ఆఫీసులో చెల్లించి వస్తానని చెప్పి ఏపీ–40 హెచ్‌ఎం–5403 యమహా–ఆర్ 15 బైక్‌లో బయలుదేరి వెళ్లాడు. అమ్మచెరువుమిట్ట ఆంజనేయస్వామి గుడి సమీపంలోని మలుపు వద్ద రోడ్డుపై మట్టి ఉండటంతో బైక్ జారి అదుపుతప్పి డివైడర్‌ను వేగంగా ఢీకొన్నాడు. ప్రమాదంలో తలకు, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో అపస్మారకస్థితికి వెళ్లాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి పవన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు.