
రహదారికి అడ్డంగా ప్రహరీ
● రాజంపేటలో టీడీపీ నేతల దౌర్జన్యం
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు
రాజంపేట రూరల్ : తమ ప్రభుత్వం అధికారంలో ఉందని.. తాము ఏ దారుణానికై నా ఒడిగడతామనే రీతిలో పలువురు కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. రాజంపేట పట్టణంలోని కృష్ణానగర్‌లో నివాస గృహాలకు అడ్డంగా ప్రహరీ నిర్మించి వారికి ఇంట్లోకి వెళ్లేందుకు దారి లేకుండా చేశారు. దీనిపై స్థానికులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఓ బి. శ్రీధర్‌రావుకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా.. 40 ఏళ్ల క్రితం వంకన సావిత్రమ్మ వద్ద సర్వే నెంబర్ 640లో గుణకల సుబ్బరాయుడు సతీమణి రామలక్ష్మితో పాటు మరో 10 మంది కలిసి దాదాపు 2 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. నాడు రాకపోకలకు గాను స్థలం వదులుకొని గృహాలను నిర్మించుకున్నారు. 1999లో గుణకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో రహదారి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే అది తమ స్థలం అని గుత్తా చెంగయ్యనాయుడు రహదారిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ మీద పిటీషన్ వేశారు. ఓఎస్ నెంబర్ 1999 జూలై 30న నందలూరు జడ్జి రహదారి నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు గుణకల సుబ్బరాయుడు తెలిపారు. అప్పటి నుంచి రహదారి నిర్మాణం చేపట్టినప్పుడల్లా గుత్తా చెంగయ్యనాయుడు కుటుంబీకులు అడ్డగిస్తూనే వస్తున్నారు. గతంలో పనిచేసిన తహసీల్దార్లు గుణ భూషణ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలు రహదారి నిర్మాణం చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చినట్లు సుబ్బరాయుడు పేర్కొన్నారు. అలాగే అప్పటి రాజంపేట సబ్ కలెక్టర్ పద్మజ కూడా దగ్గరుండి రహదారి స్థలానికి కొలతలు వేయించి హద్దులు చూపుతూ నెంబర్ రాళ్లను నాటించారు. అయితే వాటిని గుత్తా కుటుంబీకులు వారం క్రితం పట్టపగలు జేసీబీతో తొలగించి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలుపుతున్నారు.
దీనిపై రెండు వారాల క్రితం గుణకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో స్థానికులు సబ్ కలెక్టర్ భావనను కలిసి తమ సమస్యను వివరించారు. దీంతో ఆమె చలానా కడితే మీ రెండు ఎకరాల స్థలానికి హద్దులు చూపిస్తానని తెలిపారు. అయితే సబ్ కలెక్టర్ సెలవులో వెళ్లిన విషయం పసిగట్టిన ఓ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేత చకచకా చక్రం తిప్పి అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీస్ యంత్రాంగంతో మంత్రాంగం నడిపి ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేశారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకుండా దౌర్జన్యంగా ప్రహరీ నిర్మించిన వారిపై చర్యలు తీసుకుని తమకు రహదారి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కృష్ణా నగర్ వాసులు ఫిర్యాదు చేశారు.

రహదారికి అడ్డంగా ప్రహరీ