
దీపం.. విభిన్న రూపం!
రాజంపేట టౌన్ : మరో వారం రోజుల్లో వెలుగులు వెదజల్లే దీపావళి పండుగ రానుంది. ఒకప్పుడు దీపావళి అనగానే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది టపాసులు మాత్రమే. ఇంకా చెప్పాలంటే దీపావళి పండుగకు నెలరోజుల ముందు నుంచే చిన్న పిల్లలు చిన్నచిన్న టపాసులు కొనుగోలు చేసి కాల్చుతుండేవారు. అందువల్ల నె నెల రోజుల పాటు ఎక్కడో ఒక చోట టపాసుల శబ్దం వినిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ప్రజల ఆలోచనా విధానం మారింది. దీనికి తోడు టపాసులు కాల్చడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ కారణంగా ప్రజలు టపాసులను కాల్చడం చాలా వరకు తగ్గించారనే చెప్పాలి. కేవలం దీపావళి రోజు మాత్రమే పిల్లల ఆనందం కోసం ప్రజలు టపాసులు కాల్చుతున్నారు. పర్యావరణ ప్రేమికులతో పాటు అనేక మంది విద్యావంతులు దీపావళి పండుగ రోజు కూడా టపాసులకు దూరంగా ఉంటున్నారంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.
దీపాలతోనే దివాళీ..
టపాసులు కాల్చడం వల్ల కలిగే అనర్థాల గురించి తెలిసిన వారు దీపాలతోనే దివాళీ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక మహిళలు దీపాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల వ్యాపారులు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధునికతను, సాంకేతికతను కలబోస్తూ నేటి తరానికి నచ్చే రీతిలో అనేక డిజైన్లలో ఈ ఏడాది కూడా దీపాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పండుగ సమీపిస్తుండటంతో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా దివ్వెల విక్రయ దుకాణాలు ఒక్కొక్కటిగా వెలుస్తున్నాయి.
స్టేటస్‌కు తగ్గట్లుగా..
ప్రస్తుతం ఆధునికత కొత్త పుంతలు తొక్కుతోంది. అందువల్ల నూతనంగా ఇళ్లు నిర్మించుకున్న వారు, పాత ఇళ్లను రీమోడల్ చేసుకున్నవారు వారి ఆర్థిక స్థోమతను బట్టి ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఇంటి ముంగిట ఏర్పాటు చేసే దీపాలను తమ స్టేటస్‌కు తగ్గట్లు ఉండేలా ఆకర్షణీయమైన వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు కూడా ప్రజల అభిరుచికి అనుగుణంగా దీపాలను అందుబాటులో ఉంచారు. దీంతో మహిళలు తమ ఇంటి ముంగిట ఆకర్షణీయంగా ఉండే ప్రమిదలలో దీపాలను వెలిగించేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ కారణంగా కొంత మంది కాస్త ఖరీదైనా సరే ఆకర్షణీయంగా ఉండే వైరెటీ దీపాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఒకప్పుడు మట్టిదీపాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు మట్టి ప్రమిదలతో పాటు వివిధ రకాల మోడల్స్‌లో పింగాణి దీపాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క దీపం రూ.5 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. దీనికితోడు దీపావళి రోజు లక్ష్మీపూజ ఎంతో ప్రత్యేకమైనది. అందువల్ల వ్యాపారులు లక్ష్మీదేవి ప్రతిమలను కూడా అందుబాటులో ఉంచారు.
దీపావళికి దివ్వెలు సిద్ధం
ఆకట్టుకుంటున్న ప్రమిదలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
దివ్వెల విక్రయాల దుకాణాలు
ఆకర్షణీయమైన దివ్వెలతో మరింత శోభ..
ఒకప్పుడు చిన్న మట్టి ప్రమిదలే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు వివిధ మోడల్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా ఉండే దివ్వెలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి ముంగిట ఆకర్షణీయమైన డిజైన్‌లలో ఉండే దివ్వెల్లో దీపాలను వెలిగిస్తే ఇళ్లు మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతాయి.
– జి.మోహనవల్లీ, లెక్చరర్,
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, మదనపల్లె
హరిత దీపావళిని జరుపుకోవాలి..
దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అందువల్ల దీపావళి పండుగను దివ్వెలు వెలిగించి జరుపుకుంటే పర్యావరణానికి ఎంతో శ్రేయస్కరం. ప్రతి ఒక్కరు హరిత దీపావళిని జరుపుకోవాలి. టపాసులు కాల్చడం ద్వారా వచ్చే అధిక శబ్దాల కారణంగా కర్ణభేరి దెబ్బతిని వినికిడి లోపం వస్తుంది. అలాగే గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్న వారికి గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
– జి.చక్రధర్‌రాజు, నేషనల్ గ్రీన్‌కోర్ రీజనల్ కో–ఆర్డినేటర్

దీపం.. విభిన్న రూపం!

దీపం.. విభిన్న రూపం!

దీపం.. విభిన్న రూపం!

దీపం.. విభిన్న రూపం!

దీపం.. విభిన్న రూపం!