
నేతన్నకు ఉత్తుత్తి విద్యుత్!
ఆదుకున్న నేతన్న నేస్తం
నేతన్నల డిమాండ్లు
మదనపల్లె సిటీ: నేత కార్మికులకు ఉచిత విద్యుత్ జీఓ ఇచ్చి ఆరు నెలలు గడిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేతమగ్గాలు, పవర్‌లూమ్స్‌కు మంచి రోజులు వస్తాయని ఆశించారు. ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా విద్యుత్ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడువుగా జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడంతో నేతన్నలు మండిపడుతున్నారు.
● ఉచిత విద్యుత్ జీఓతో తమ కుటుంబాలకు కొంతైనా ఆర్థికభారం తగ్గుతుందనుకున్న నేతన్న జీవితాల్లో నిరాశే మిగిలింది. వ్యవసాయం తర్వాత చేనేతరంగం అతి పెద్ద ఉపాధిరంగం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది. జిల్లా వ్యాప్తంగా 20 వేల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి ఉన్నాయి. మదనపల్లె (నీరుగట్టువారిపల్లె)లో సుమారు 12 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎనిమిది వేలకుపైగా చేతి మగ్గాలు, మూడు వేలకుపైగా పవర్‌లూమ్స్ ఉన్నాయి. కలకడ, తంబళ్లపల్లె, నిమ్మనపల్లె, వాల్మీకిపురం, కురబలకోట, బి.కొత్తకోట, పుల్లంపేట, చిన్నమండ్యం, గాలివీడు,సుండుపల్లి, రాజంపేట, వీరబల్లి మండలాల్లో చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చేనేత మగ్గాల ధ్వని వినిపించడం తగ్గిపోతోంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణం. గత మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్ జీవో నంబర్ 44 ఆరు నెలలు పూర్తయినా అమలు కాకపోవడంతో నేతన్నలు ఆందోళన చెందుతున్నారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఇది అమలు కావడం లేదు
జీవో అమలులో నిర్లక్ష్యం
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చాలంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చారు.దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28వతేదీన జీవో –44 విడుదల చేసింది. వాస్తవ సంఖ్య, చేతి మగ్గాలు, పవర్‌లూమ్స్ యూనిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి జీవోను విడుదల చేసింది. చేనేత కుటుంబాలకు నెలకు రూ.200 యూనిట్లు, పవర్ లూమ్స్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. అయితే ఆగస్టు 7 న జాతీయ చేనేత దినోత్సవం రోజున ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సహాయం అందించింది.జిల్లాలో 2021లో రూ.14,00, 88,000, 2022లో రూ.14,68,32,000, 2023లో రూ.16,64,88,000 నేతన్న నేస్తం కింద అందించారు.
జీవో నంబర్ 44ను వెంటనే అమలు చేయాలి.
రాష్ట్ర బడ్జెట్ నుంచి 10 శాతం 3,000 కోట్లు కేటాయించాలి
నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలి.
నూలు,సిల్క్‌లకు 50 శాతం రాయితీ ఇవ్వాలి
చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి
గృహం, వర్క్‌షెడ్ పథకాన్ని అమలు చేయాలి.
జీవిత బీమా సంస్థ, కేంద్ర,రాష్ట్ర ప్ర భుత్వాలు సంయుక్తంగా అమలు చే సిన బీమా పథకాన్ని కొనసాగించాలి.
ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు రూ.7లక్షలు ఎక్స్‌గ్రేషియా
ఇవ్వాలి.
ఉచిత విద్యుత్ హామీప్రకటనలకే పరిమితం
అమలుపై మీనమేషాలులెక్కిస్తున్న కూటమి ప్రభుత్వం
జీవో ఇచ్చారు.. మరిచిపోయారు
ఉచిత విద్యుత్ పేరిట జీఓ ఇచ్చి అమలు చేయకపోవడం దారుణం. పెరిగిన విద్యుత్ చార్జీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మార్చి నెలలో జీఓ ఇచ్చారు. ఆగస్టులో అమలు చేస్తామని చెప్పారు. అక్టోబర్ వచ్చినా బిల్లులు చేతికిస్తున్నారు. –జీ.సుధాకర్, నేత కార్మికుడు,
నీరుగట్టువారిపల్లె(మదనపల్లె)
ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలి
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం వెంటనే అమలు చేయాలి. ఆగస్టునెల నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. బిల్లులు మాత్రం ఇస్తున్నారు. దీనిపై చేనేత కార్మిక సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తాం. ప్రభుత్వం వెంటనే దీనిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
–శీలం రమేష్, వైఎస్సార్‌పీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు

నేతన్నకు ఉత్తుత్తి విద్యుత్!

నేతన్నకు ఉత్తుత్తి విద్యుత్!