
అటవీభూమిలో నిర్మాణం అడ్డగింత
మదనపల్లె రూరల్ : అటవీ భూమిలో కొందరు వ్యక్తులు దర్గా నిర్మిస్తున్నామంటూ పనులు ప్రారంభించడంతో సోమవారం రాత్రి మదనపల్లె మండలం చీకలబైలులో ఉద్రిక్తత నెలకొంది. ఫారెస్టు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మదనపల్లె మండలం చీకలబైలు గ్రామం, దొనబైలు దారిలోని పులిమానువంకవద్దనున్న అటవీభూముల్లో బండవద్దకు పట్టణంలోని ఈశ్వరమ్మకాలనీ, కర్ణాటక రాష్ట్రం ముల్‌బాగల్‌కు చెందిన కొంత మంది మహిళలు, పది మంది పురుషులతో వాహనంలో అక్కడికి చేరుకున్నారు. పూజలుచేసి దర్గా నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అయితే స్థానికులు పూజలు చేసుకుంటున్నారని భావించారు. అక్కడికి వెళ్లిన ఓ మహిళతో వారు ఇక నుంచి మీరు ఇక్కడ దుస్తులు ఉతకరాదని, ఈ ప్రదేశంలో దర్గా నిర్మాణం చేస్తున్నామంటూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఎగువపల్లె, చీకలబైలు, జమ్మికుంటపల్లె, దిగువపల్లె ప్రజలు చీకటి పడుతుండగా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే తమకు దర్గా నిర్మాణానికి అనుమతులు ఉన్నాయంటూ చెప్పడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో స్థానికులు ఫారెస్టు ,తాలూకా పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఫారెస్టు రేంజర్ జయప్రసాదరావు, ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఉమాదేవి , తాలూకా ఎస్.ఐ చంద్రమోహన్, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మాణ సామగ్రిని, దర్గా నిర్మాణపనులుకు వచ్చి వ్యక్తులను, వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. గుమికూడిన స్థానికులను అక్కడి నుంచి పంపివేశారు. సాయంత్రం నుంచి రాత్రి 9.30 గంటల వరకు పోలీసులు అక్కడే పహారా కాశారు. చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు, నాగమ్మ అనే వ్యక్తులకు సంబంధించి ఆరోగ్యం మెరుగుపడటానికి పూజలు చేసే పేరుతో ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై చుట్టుపక్కల గ్రామస్తులు మంగళవారం ఉదయం మరోసారి సమావేశం కానుననట్లు తెలుస్తోంది.