
అడవిలో తమ్ముళ్ల మట్టిదందా
సాక్షి టాస్క్ ఫోర్స్ : కూటమి నాయకుల అక్రమాలు, ఆగడాలకు అంతులేకుండా పోతోంది. కొండలు గుట్టలు చదును చేసి సొమ్ము చేసుకున్న తెలుగు తమ్ముళ్లు... తాజాగా అడవుల్లోని మట్టిని కూడా తవ్వేస్తున్నారు. రాజంపేట మండల పరిధిలోని కోనరాజు పల్లి పంచాయతీ అడవి ప్రాంతంలో అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు ఒక జెసీబీని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అడవిలో తవ్వకాల వెనుక అసలు సంగతి ఏంటంటే..... తలసాని కుంటలో పంట పొలాలకు వేసుకునేందుకు మట్టిని తవ్వేందుకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చారు. దీన్ని సాకుగా చూపి అనుమతులు ఇచ్చిన చోటు కాకుండా అడవిలో తవ్వకాలు జరిపారు. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది అటవీ ప్రాంతంలోని మట్టిని తవ్వినట్లు నిర్ధారించుకున్నారు. మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు, జేసీబీ సీజ్ చేశారు. విషయాన్ని కడపలోని ఎఫ్‌ఆర్‌ఓ సుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లారు. మట్టిని తరలిస్తున్న వ్యక్తులు కూటమి నాయకులు కావడంతో, రాజంపేట అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత నుంచి వాహనాలు వదిలేయాల్సిందిగా ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి వచ్చింది. దీంతో పట్టుకున్న వాహనాలకు 40 వేల జరిమానా విధించి విడిచిపెట్టారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపిన తమ్ముళ్లపై చర్యలు తీసుకోకుండా వాహనాలకు జరిమానా విధించి వదిలేయడంపై ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.