
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు
గుర్రంకొండ : ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని నడిమికండ్రిగ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గల్లా నాగరత్నమ్మ(73) భర్త రామయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో నాగరత్నమ్మ అదే గ్రామంలోని తన కుమార్తె ఇంట్లో నివాసముంటోంది. ప్రతిరోజు గ్రామానికి సమీపంలోని శ్రీనివాస డాబా పక్కనే ఉన్న పాత ఇంట్లో పాడిఆవులకు నీరుతోడి పశుగ్రాసం వేసి గ్రామంలోకి వచ్చేది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పాత ఇంటివద్ద పాడిఆవులకు నీరు పెడుతుండగా గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంలో అక్కడికి చేరుకొన్నారు. దాహంగా ఉందని మంచినీళ్లు కావాలని ఆమెను అడిగారు. నాగరత్నమ్మ నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళుతుండగా వెనుకవైపు నుంచి దుండగులు ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కొని ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లిపోయారు. దీంతో మహిళ పెద్ద ఎత్తున కేకలు వేయగా గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారి జాడకోసం గాలించారు. అయితే అప్పటికే దుండగులు గ్రామం వదిలి పరారయ్యారు. చోరీకి గురైన 30 గ్రాముల బంగారు గొలుసు విలువ రూ. 3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. జరిగిన సంఘటనపై బాధితురాలు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘరామ్ తెలిపారు.