
విద్యా రంగ సేవకుడికి విశిష్ట గౌరవం
కురబలకోట : విద్యారంగంలో విశేష కృషి చేసిన బి.ఈశ్వరయ్యకు న్యూడిల్లీలో భారత్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సాధారణ కు టుంబం నుంచి అంచెలంచెలుగా జిల్లా, రాష్ట్ర, జాతీ య స్థాయి గుర్తింపు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈశ్వరయ్యకు ఈ పురస్కారం దక్కింది.
మండలంలోని ఎనుములవారిపల్లెకు చెందిన ఈశ్వరయ్య రిషి వ్యాలీ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. మదనపల్లె బీటీ కళాశాలలో డిగ్రీ చదివి గోల్డ్ మెడల్ సాధించారు. ఎంఏ బీఈడీ చేసి విద్యారంగం వైపు మక్కువ చూపారు. రిషి వ్యాలీ రివర్ స్కూల్‌లో టీచర్‌గా, ఆ తర్వాత హెడ్మాస్టర్‌గా ఏడేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ నాంది పౌండేషన్‌లో ఎడ్యుకేషనల్ రీసోర్సు పర్సన్‌గా నాలుగేళ్లు, న్యూఢిళ్లీ హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ప్రిన్సిపల్, డైరెక్టర్‌గా మూడేళ్లపాటు సేవలందించారు. అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు 200 మంది ఈశ్వరయ్య వద్దకు విమానంలో వచ్చి సలహాలు, తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆపై న్యూడిల్లీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ హెడ్‌గా పదేళ్లపాటు పనిచేశారు. ఎన్‌సీఈఆర్టీలో రీసోర్సు పర్సన్‌గా గత ఏడేళ్లుగా కొనసాగుతున్నారు.
విద్యా సంస్కరణల్లో కీలక పాత్ర
విద్యా రంగంలో ఇతడి సేవలను గుర్తించిన గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి విద్యా సంస్కరణల కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ కమిటీలో రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ కమిటీ సభ్యుడిగా సమున్నత స్థానం కల్పించింది. ఐదేళ్ల పాటు ఇతడు ఇన్పోసిస్ సుధానారాయణమూర్తి, మరో తొమ్మిది మందిసభ్యులలో ఒకడిగా క్రియాశీలకంగా పనిచేశారు. అప్పట్లో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ చదువులు ఎలా ఉండాలనే అంశంపై నివేదిక సమర్పణలో ఆయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని అన్ని డైట్ కళాశాలలు తిరిగి.. ఆయన అందించిన సేవలకు ఇపుడు గుర్తింపు లభించింది. నీతి అయోగ్ పర్యవేక్షణలో నడిచే న్యూఢిల్లీ భారత్ వర్చువల్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్లు 2025 సంవత్సరానికి ఇతనికి గౌరవ డాక్టరేట్ అవార్డు ఇచ్చి సత్కరించారు.
ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో ఇతనికి ఒక్కడికే ఈ డాక్టరేట్ లభించడం మరో విశేషం.
సమాజ నిర్మాణంలో విద్య కీలకం
సమాజ నిర్మాణంలో విద్యకు ప్రాధాన్యం ఉంది. విద్యార్థులకు చదువు నేర్పడం కన్నా ముందు వారిలో ఆత్మ విశ్వాసం నింపాలి. చదువు పట్ల భయం పోగొట్టాలి. బడి పట్ల ఇష్టం కలిగేలా చూస్తూ పుస్తకాలను చదివించేలా చూడాలి. ఈ గౌరవ డాక్టరేట్ అవార్డు విద్యా వ్యవస్థ గొప్పతనంగా భావిస్తున్నా. పేదరికాన్ని జయించడానికి చదువే గొప్ప అస్త్రం. ఎవ్వరైనా ఉన్నతంగా ఎదగడానికి చదువుకు మించిన ఆయుధం లేదు.
– ఈశ్వరయ్య
భార త్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం

విద్యా రంగ సేవకుడికి విశిష్ట గౌరవం