
విపత్తుల నివారణపై మాక్ డ్రిల్
సిద్దవటం : విపత్తుల నివారణపై మండలంలోని భాకరాపేట హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో కర్మాగారాల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ చిన్నారావు ఆధ్వర్యంలో మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. ముందుగా హెచ్‌పీసీఎల్‌లోని ఎమర్జెన్సీ–1లోని ట్యాంకు వద్ద డీజిల్ లీక్ అవడంతో దాన్ని కంట్రోల్ చేసేందుకు సిబ్బంది పనిచేస్తుండగా స్కానర్ కిట్టు కింద పడి మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న వర్కర్లు ఫైర్ అని అరవడంతో హెచ్‌పీసీఎల్ సిబ్బంది సైరన్ మోగించారు. సిబ్బంది అప్రమత్తమై ఆటోమేటిక్ పరికరాలతో ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో పెట్రోల్ డిపో సిబ్బంది సహకారంతో పోమ్, వాటర్‌తో మంటలను అదుపు చేశారు. అక్కడ ఇద్దరు వర్కర్లకు ప్రమాదం జరగడంతో వారిని మెడికల్ క్యాంపుకు సిబ్బంది తీసుకొచ్చే సన్నివేశాన్ని మాక్ డ్రిల్ చేసి చూపించారు. అలాగే ఫిల్టర్–ఎ వద్ద డీజిల్ ఓవర్ లీక్ అవుతుండటంతో అక్కడి వర్కర్లు మరమ్మతులు చేస్తుండగా స్పోనర్ కిందపడి మంటలు చెలరేగాయి. ఫైర్ అయిందని గట్టిగా కేకలు వేయడంతో హెచ్‌పీసీఎల్ సిబ్బంది మరోసారి సైరన్ మోగించారు. సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేసేందుకు డీసీపీ ఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా పోమ్, నీటితో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వర్కర్లు అస్వస్థతకు గురికావడంతో స్ట్రక్చర్‌పై మెడికల్ క్యాంపు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు పరిశీలించి కడప రిమ్స్ ఆసుపత్రికి పంపారు. ఇదంతా మాక్ డ్రిల్ అని తెలిసింది. చిన్నారావు మాట్లాడుతూ చట్ట ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ డిపో మేనేజర్ సతీష్‌కుమార్, జిల్లా ఫైర్ ఆఫీసర్ ధర్మారావు, పైపులైన్ డీజీఎం ఓబయ్య, కడప ఏజీ అండ్ పీ మానస్, సెక్యూరిటీ సూపర్‌వైజర్ సిద్దారెడ్డి, హెచ్‌పీసీఎల్, పైపులైన్ , సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.