
వైఎస్‌ఆర్ నగర్‌లో గృహాల కూల్చివేత
● ఫోర్జరీ సంతకాలతో అనుబంధ పత్రాలు
● న్యాయం చేయాలని బాధితులు వేడుకోలు
సిద్దవటం : మండలంలోని మాధవరం–1 పంచాయతీ పరిధి వైఎస్‌ఆర్ నగర్ 892/3 సర్వే నంబర్‌లో ఏర్పాటు చేసుకున్న నివాస గృహాలను కొందరు వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం కూల్చివేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు బొడ్డుబోయిన నారాయణ, ఇప్పలపల్లె సుజాత, కోండ్ల పార్వతమ్మ, భోగా లక్ష్మమ్మలు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం 2008లో రెవెన్యూ శాఖ అధికారులు ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేసి డీ ఫారాలు, అనుబంధ పత్రాలను అందజేశారన్నారు. అందులో తాము గృహాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆయా గృహాలకు మాధవరం గ్రామ పంచాయతీకి పన్నులు కూడా చెల్లిస్తున్నామన్నారు. గృహాలకు విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకోగా అవి కూడా వచ్చాయన్నారు. ఈ క్రమంలో పాటూరు గంగిరెడ్డి, ఎర్రి వెంకటరెడ్డిలు కొందరు బయటి వ్యక్తులను పిలుచుకొని వచ్చి సిద్దవటం పోలీసుల ఆధ్వర్యంలో తాము లేని సమయంలో నూతనంగా నిర్మించుకొన్న గృహాలను కూల్చివేశారన్నారు. అలాగే పాటూరు గంగిరెడ్డి, ఎర్రి వెంకటరెడ్డిలు ఫోర్జరీ సంతకాలతో అనుబంధ పత్రాలను సృష్టించి ఇవి తమ స్థలాలే అని కట్టడాలను కూల్చివేశారన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.