
పీకేఎం ముడా చైర్మన్ బీఆర్.సురేష్ ప్రమాణస్వీకారం
బీఆర్ సురేష్ ఎమ్మెల్యే కావాలన్న శ్రీనివాసులు
ఎక్కడో పోటీ చేసే ఎమ్మెల్యే నాకొద్దన్న సురేష్
మదనపల్లె : స్థానిక పంచాయతీరాజ్ ప్రాంగణంలో సోమవారం పీకేఎం ముడా చైర్మన్ బీఆర్.సురేష్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పదవిపై పరస్పర వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. సభలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ ‘బీఆర్ సురేష్ తండ్రి దొరస్వామినాయుడు ఎమ్మెలేగా చేశారు, సురేష్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఉంది. అందుకనే ఆయన టీడీపీ రాజకీయాల్లో ఎదిగి ఎమ్మెల్యే కావాలని కోరుకొంటున్నట్టు’ చెప్పడంతో ఎమ్మెల్యేలు, కుప్పం నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు.
కుప్పంలో చంద్రబాబు ఉండగా ఆయన స్థానంలో సురేష్ పోటీ చేయాలా అన్న చర్చ మొదలైంది. చివర్లో ప్రసంగించిన బీఆర్.సురేష్ ఎక్కడో (వేరే నియోజకవర్గాలు) వెళ్లి ఎమ్మెల్యే కావాలని లేదని, కుప్పంలోనే ఉండి పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. తనకు ఎమ్మెల్యే పదవిపై ఆశలేదని ప్రకటించి ఉంటే సరిపోయేది, అలా కాకుండా ఎక్కడో వెళ్లి పోటీ చేయలేనని చెప్పడం చూస్తే కుప్పంలో పోటీ చేయాలన్న ఆలోచన ఉందా అంటూ హాజరైన పలువురు చర్చించుకోవడం కనిపించింది.
ఈ సభకు ముందు బీఆర్.సురేష్ పీకేఎం ముడా చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు యండపల్లె వెంకట్రావ్, షాజహాన్‌బాషా, జగన్‌మోహన్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.