
సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు
రాయచోటి అర్బన్: గత నాలుగు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దెలు, కూరగాయల బిల్లులతో పాటు రెండు మాసాలుగా జీతాలు అందలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు పేర్కొన్నారు. సోమవారం ఆయన రాయచోటిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని అధికారులు చేతులెత్తేయడంతో ఈ నెల 13వ తేదీన మహాధర్నాకు పిలుపునిచ్చామన్నారు. ప్రతి సెంటర్‌కు దాదాపు రూ.50 నుంచి 60వేల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. శనివారం లోగా పెండింగ్ బిల్లులు చెల్లించి , జీతాలు కూడా విడుదల చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సుమలత, విజయమ్మ, సురేఖ, భూదేవి, శంకరమ్మ, పద్మజ, షబాన, కళావతి, పీరమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 డిప్యూటీ డైరెక్టర్‌గా నాగ రత్నమ్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పరిపాలన అధికారిగా విధులు నిర్వహించారు. పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్ వనిషా, రవి, మానస తదితరులు నాగరత్నమ్మను అభినందించారు.
గాలి, వానకు దెబ్బతిన్న వరిపంట
సిద్దవటం: మండలంలోని ఎస్.రాజంపేట, వంతాటిపల్లి, కడప యాపల్లి, లింగింపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరిపంట ఆదివారం రాత్రి వీచిన గాలులకు దెబ్బతింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి రమేష్‌రెడ్డి ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వంద ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. రైతులు జూన్ నెల చివరి వారంలో వరి సాగు చేశారు. ఎకరా పంటకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేశారు. ఈ నెల చివరిలో పంటను కోయాల్సిన సమయంలో గాలి, వానలకు నేలకొరిగి దెబ్బతింది. గతంలో పంట నష్టానికి ప్రభుత్వం బీమా కల్పించేదని, అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రభాకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
లక్కిరెడ్డిపల్లి/రామాపురం: స్మార్ట్ పోలీసింగుతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లి సర్కిల్ పరిధిలోని రామాపురం పోలీస్టేషన్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ ప్రాంగణం, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చే వృద్ధులు, మహిళలు, బాధితుల పట్ల ఆప్యాయంగా, ఓర్పుతో వ్యవహరించాలని సూచించారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. రామాపురం పరిధిలోని గువ్వలచెరువు ఘాటు రోడ్లలో జరిగే ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, బాలలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, రాయచోటి రూరల్ సిఐ వరప్రసాద్, రామాపురం ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ