
మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్సి ఆర్సీ ఈశ్వర్ రెడ్డి
కురబలకోట: ములకలచెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీలో చినబాబు (నారా లోకేష్), పెదబాబు (నారా చంద్రబాబు) ప్రమేయం ఉందని, లేదంటే ఇంత దైర్యంగా హైవే పక్కన నకిలీ మద్యం తయారు చేయడం అంత సులభం కాదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్సి ఆర్సీ ఈశ్వర్‌రెడ్డి, అంగళ్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డీఆర్. ఉమాపతిరెడ్డి ఆరోపించారు.
కురబలకోట మండలంలోని కనసానివారిపల్లెలో పార్టీ నాయకులతో కలసి సోమవారం విలేకరుతో వారు మాట్లాడుతూ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రభుత్వ దుకాణాల వ్యవస్థకు మంగళం పాడి ప్రైవేట్ వారికి మద్యం షాపులు కేటాయించినప్పుడే చంద్రబాబు బుద్ధి బయటపడిందన్నారు. నకిలీ మద్యం తయారీ విక్రయాల వెనుక రాష్ట్ర స్థాయి పెద్దల ప్రమేయం ఉందన్నారు. మరో వైపు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా భారీగా నకిలీ మద్యం రాకెట్ తాజాగా బయటపడిందన్నారు. ఇది కూడా ములకలచెరువు తరహాలో ఉండడంతో ఇలాంటి యూనిట్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండవచ్చనడానికి బలాన్ని చేకూరుస్తోందన్నారు. దీన్ని బట్టి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని చెప్పవచ్చన్నారు. సమగ్ర విచారణ జరిపితే పెద్ద కుంభకోణమే బయటపడుతుందన్నారు.
రాష్ట్ర పెద్దల బండారం తెలిసి రాగలదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధునన్ రెడ్డిని అక్రమంగా మద్యం కేసులో అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఆ పాపం నకిలీమద్యంతో కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతోందన్నారు. తంబళ్లపల్లె నియోజక వర్గానికి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం మరక అంటించించడం విచారకరమన్నారు.
రాయలసీమ కరువును పారదో లడానికి ఫ్యాక్టరీలు రప్పిస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నారు. ప్రజలు నమ్మి గెలిపిస్తే చివరకు నకిలీ మద్యం ఫ్యాక్టరీలకు తెరలేపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. నకిలీ మద్యం కేసులో పెద్దల బాగోతాన్ని బయటపెట్టకపోతే వైఎస్సార్ సీపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
●తంబళ్లపల్లి నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి డి. జయచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో నియోజక వర్గానికి చదువుకున్న వ్యక్తిగా ఫ్యాక్టరీలు రప్పిస్తామని చెప్పారని, చివరకు నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించి జనాల చెవిలో పూలు పెట్టారని అన్నారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నా ఎకై ్సజ్, పోలీస్ శాఖలు పసిగట్టలేక పోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టడమేనన్నారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎంజీ భూదేవి, వైస్ ఎంపీపీ ఎన్‌వి. రమణారెడ్డి, మండల కన్వీనర్ మధుసూధన్ రెడ్డి, మహిళా నాయకురాలు రెడ్డి కుమారి, సర్పంచ్ ఆర్కే కృష్ణారెడ్డి, నక్కా రమాదేవి తదితరులు పాల్గొన్నారు.