
చౌక బియ్యం పట్టివేత
సిద్దవటం : మండల పరిధి మాధవరం–1 గ్రామ పంచాయతీ మహబూబ్‌నగర్ గ్రామంలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాల చౌక దుకాణం బియ్యాన్ని ఆదివారం పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారని వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 681 కేజీల బియ్యం స్వాధీనం చేసుకుని, సిద్దవటం ఆకులవీధికి చెందిన అతికారి మురళి, కడపకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.
ఆటోను ఢీకొన్న కారు
మదనపల్లె సిటీ : నిలిచివున్న ఆటోను కారు ఢీకొనడంతో నలుగురు గాయపడిన సంఘటన కురబలకోట మండలం కంటేవారిపల్లెలో ఆదివారం జరిగింది. సత్యసాయిజిల్లా కొక్కంటికి చెందిన లక్ష్మిదేవి కుటుంబ సభ్యులతో కలిసి బోయకొండకు ఆటోలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కంటేవారిపల్లె వద్ద ఓ హోటల్ వద్ద ఆగారు. ఆటోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మిదేవి(55), హేమంత్(11), చంద్రశేఖర్ (45), కిరణ్‌కుమార్(30) గాయపడ్డారు. వీరిని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
ఒంటిమిట్ట (సిద్దవటం) : మండల పరిధిలోని నడింపల్లి వద్ద ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మండల పరిధిలోని మలకాటిపల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణారెడ్డి, రేణుక, వారి కుమార్తెలు నందలూరు మండలం నల్లతుమ్మలపల్లి గ్రామంలో వివాహ వేడుకకు కారులో వెళ్తుండగా.. మంగంపేట వద్ద గుర్తు తెలియని కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. కారులో మిగిలిన ముగ్గురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పోరుమామిళ్ల : ఏళ్లు గడుస్తున్నా తన ఇంటి సమస్య పరిష్కరించలేదని ఓ వ్యక్తి ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. ఆరేళ్ల క్రితం అమ్మవారిశాల పురాతన మందిరం తొలగించి నూతనంగా నిర్మించే సమయంలో.. ఆనుకుని ఉన్న దర్శి సత్యనారాయణ ఇల్లు దెబ్బతింది. అప్పట్లో ఆలయ కమిటీవారు ఈ ఇంటిని మళ్లీ యథాతథంగా చేస్తామన్నారు. తరువాత వివిధ కారణాలతో ఆ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. సత్యనారాయణ ఇల్లు బాగు కోసం ఎంత ఖర్చు చేసినా ఇస్తామని కమిటీవారు చెబితే, మీరే బాగు చేయాలని ఆయన అన్నాడని, తాము చేస్తామంటే అలా కాదు, ఇలా కాదు, అంటూ ఏవేవో సాకులు చెపుతూ సత్యనారాయణ సమస్య పరిష్కారానికి అవకాశం ఇవ్వడం లేదని ఆలయ సభ్యుల మాట. తన ఇంటిని ఇంత వరకు బాగు చేయించలేదని సత్యనారాయణ వాదన. ఇలా ఇరువురి మధ్య సమస్య తెగక నలుగుతూ ఉంది. ఆదివారం అమ్మవారిశాలలో మరో పంచాయతీపై పట్టణ ఆర్యవైశ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో తన సమస్యకు పరిష్కారాం చూపాలని దర్శి సత్యనారాయణ పట్టుబట్టారు. ఆ సమస్యపై సభ్యులు మాట్లాడటం లేదని ఆవేశంతో సత్యనారాయణ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అందరి ముందు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. వెంటనే అక్కడున్నవారు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.